ఈ జీవితం వద్దని..!

21 Mar, 2015 02:03 IST|Sakshi

వారు ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. సొంత అక్కాచెల్లెళ్లు కాకపోయినా వివాహమై ఒకే ఇంటి కోడళ్లుగా వచ్చాక ఎంతో ఆప్యాయంగా ఉంటూ వచ్చారు. అయితే క్రమక్రమంగా వారి ఆశలు అడియాసలవుతూ వచ్చాయి. భర్తల ప్రవర్తనతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. తీవ్ర నిర్లక్ష్యం.. నిరాదరణ మధ్య బతికడం కంటే చావడమే మేలనుకున్నారు. కష్టాలు.. కన్నీళ్లు కలిసి పంచుకున్న ఆ తోడికోడళ్లు చివరకు కలిసే మరణించారు. తాము చనిపోతే తమ బిడ్డలు అనాథలుగా మారతారని భయపడ్డారో ఏమో వారిని కూడా తమ వెంట తీసుకెళ్లారు.
 
ఓబులవారిపల్లె: ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామానికి చెందిన తోడి కోడళ్లు అరుణ(25) మణెమ్మ(18) తమ కుమార్తెలతో కలిసి  ఓబులవారిపల్లె- అనంతరాజుపేట మార్గమధ్యంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు.. బంధువులు.. పోలీసుల కథనం మేరకు. బాలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన అరుణ, వై.కోట గ్రామానికి చెందిన మణెమ్మలకు వై. కోటకు చెందిన అన్నదమ్ములు నారాయణ, నాగరాజులతో వివాహమైంది. పదేళ్ల క్రితం అరుణను నారాయణ వివాహం చేసుకోగా వీరికి హరిత(2) ఏకైక సంతానం. తమ్ముడు నాగరాజు మణెమ్మలకు మూడేళ్ల క్రితం పెళ్లి కాగా వీరికి ఎనిమిది నెలల పావణి ఏకైక సంతానం. రెండు కుటుంబాలు అదే గ్రామంలో వేర్వేరుగా జీవనం సాగిస్తూ వస్తున్నారు.

శుక్రవారం అరుణ కుమార్తె హరిత పుట్టినరోజు కావడంతో కొత్త బట్టలు కొనేందుకు గురువారం సాయంత్రం తోడికోడలు ఇరువురు పిల్లలతో కలిసి రైల్వేకోడూరుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లారు. రాత్రి పొద్దుపోయినా ఎంతసేపటికీ వీరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప బంధువులను సంప్రదించారు. ఎక్కడా వీరి జాడ తెలియలేదు. వీరు గురువారం రాత్రి పొద్దుపోయే వరకు అనంతరాజుపేట రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఇరువురు మహిళలు రైలు కింద పడినట్లు చెన్నై- ముంబై రైలు డ్రైవరు అనంతరాజుపేట రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి చూడగా అరుణ, మనెమ్మతో పాటు వారి పిల్లలు హరిత, పావని రైలు పట్టాల మధ్య విగత జీవులుగా పడి ఉన్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై వీరు ఈ చర్యకు పాల్పడినట్లు బంధువుల ద్వారా తెలుస్తోంది. పుట్టిన రోజే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి హరిత.. నెలలు నిండని పసికందు పావనిల మృతదేహాలను చూసిన స్థానికులు చలించిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నందలూరు ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్  ఖాసీంసాహెబ్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
వివాహేతర  సంబంధాలే కారణమా..?
మృతుల భర్తలిద్దరూ జీపు డ్రైవర్లుగా పనిచేసేవారు. వీరు వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినట్లు మృతుల బంధువుల ద్వారా తెలిసింది. తమ బాగోగులు పట్టించుకోని భర్తలతో సంసారం చేసేకన్నా చనిపోవడమే మేలని ఆ ఇద్దరు తోడికోడళ్లు నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసినప్పటికి భర్తలు సంఘటన స్థలానికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
పుట్టిన రోజు.. కొత్త బట్టలు కొనుక్కుందామని..
ఈనెల 20న శుక్రవారం అరుణ ఏకైక కుమార్తె హరిత(2) పుట్టినరోజు. పుట్టిన రోజుకు కొత్త దుస్తులు కొనిపించేందుకు బిడ్డను వెంట తీసుకుని వెళ్లిన అరుణ వెంట తోడికోడలు మనెమ్మ ఆమె కూతురు పావని వెళ్లారు. కానీ ముందే నిర్ణయించుకున్నారో.. లేక అప్పటికప్పుడు అనుకున్నారో బిడ్డలతో సహా వారు రైలుకిందపడి తనువు చాలించారు. పుట్టినరోజున కొత్త బట్టలు ధరించి కళకళలాడాల్సిన ఆ చిన్నారి తన పుట్టిన రోజే మరణించిన రోజుగా మారుతుందని పాపం.. కలలో కూడా ఊహించి ఉండదు.

>
మరిన్ని వార్తలు