గర్భంలోనే సమాధి

20 Oct, 2013 04:10 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా 228 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కరీంనగర్‌తోపాటు అన్ని పట్టణాల్లోనూ ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా లింగనిర్ధారణ పరీక్షలకు సంబంధించి నియంత్రణలు ఉన్నట్టు కనిపించడంలేదు. లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలులోకి వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అవుతున్నా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, పరీక్షలు చేయించుకున్నవారి మధ్య పరస్పర అంగీకారం వల్ల ఈ అక్రమం వెలుగుచూడడంలేదు.
 
 కఠిన శిక్షలున్నా ...
 ఆడపిల్లల పట్ల వివక్ష పెరగడం, అడ్డగోలుగా భ్రూణహత్యలు జరగడంతో ప్రభుత్వం గర్భధారణపూర్వ, గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చట్టాన్ని 1994లో తీసుకొచ్చింది. ఇందులో లోపాలను తొలగిస్తూ, నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ 2003లో చట్టాన్ని సవరించింది.
 
 ఈ చట్టాన్ని ఉల్లంఘించి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే మొదటిసారి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని రెండవసారి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తారు. భ్రూణహత్యలకు కూడా శిక్షలు కఠినంగానే ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో అబార్షన్ చేయించిన వారి కుటుంబసభ్యులపైనా చర్యలు తీసుకునే వీలుంది. భ్రూణహత్యలకు పాల్పడిన వారికి మొదటి నేరమయితే మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా, అదే నేరం తిరిగి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వైద్యుల లెసైన్సులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ రద్దు చేయవచ్చు. శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా పర్యవేక్షణ కరువు కావడం ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది.
 
 సమావేశాల ఊసేదీ...
 లింగనిర్ధారణ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఉన్నతస్థాయి అధికార కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే కమిటీలో జిల్లా జడ్జీ, ఎస్పీ, ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యదర్శిగా ఉంటారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పోలీసు అధికారి, న్యాయవాది, ఎన్జీవో ప్రతి నిధి, ఆరోగ్యశాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ క మిటీ కనీసం నెలకోసారయినా సమావేశం కావాలి. వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించాలి. జిల్లాస్థాయి కమిటీ సమావేశం మూడు నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత దాని ఊసే లేదు.
 
 అమ్మాయిలంటే చిన్నచూపు...
 ఆడపిల్లల పట్ల జిల్లాలో వివక్ష పెరుగుతోంది. ఆడ, మగ పిల్లల సంఖ్యలో పెరుగుతున్న తేడా దీనికి అద్దంపడుతోంది. ఆరేళ్లలోపు పిల్లల్లో బాలురు 51.90 శాతం అయితే, బాలికలది 48.10 శాతమే. 2011 జనాభా లెక్కల  ప్రకారం జిల్లాలో ఆరేళ్లలోపు పిల్లలు 3,36,054 మంది కాగా, ఇందులో 1,62,406 మంది బాలికలు. 1,74,647 మంది బాలురు. జిల్లాలో ప్రతి వెయ్యిమంది బాలురకు 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. వంశోద్ధారకుల కోసం ఆరాటపడుతున్నవారి చర్యలతో ఈ పరిస్థితి తలెత్తుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆకాశంలో సగం... అన్నింట్లో సగం అని వల్లించడం తప్ప ఆచరణలో ఆడవారిని సమానంగా చూడలేకపోతున్నారు. మగ సంతానం కోసం తాపత్రయపడుతూ ఆడపిల్లలను తల్లిగర్భంలోనే హతమారుస్తున్నారు. మహిళల రక్షణ కోసం, వివక్షను అంతం చేసేందు కోసం తెచ్చిన చట్టాల అమలు విషయంలో అధికారులు ప్రదర్శించే నిర్లక్ష్యం  వెనుక ఉన్నది కూడా వివక్షేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
 - డిఎంహెచ్‌వో కొమురం బాలు
 
 లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై మా అధికారుల పర్యవేక్షణ ఉంది. లింగ నిర్థారణ పరీక్షల నియంత్రణకు సంబంధించి చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలబాలికల నిష్పత్తిలో తేడాకు లింగనిర్ధారణ మాత్రమే కారణమని భావించలేము. జిల్లాస్థాయి కమిటీ సమావేశం ఈ నెలలోనే జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు