సాహితీ పురస్కారాలకు సూచనల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

సాహితీ పురస్కారాలకు సూచనల ఆహ్వానం

Published Sun, Oct 20 2013 4:10 AM

Invitation to the instance of literary awards

నాంపల్లి, న్యూస్‌లైన్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేస్తున్నది. 2012 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు వివిధ వర్గాల నుంచి విశ్వవిద్యాలయం సూచనలు కోరుతోంది. వివిధ ప్రక్రియల్లో 2009 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య కాలంలో తొలిసారిగా ప్రచురణ పొందిన గ్రంథాల్లో పాఠకులు ఉత్తమంగా భావించిన గ్రంథాలను అవార్డులకు సూచించ వచ్చు.

వచన, కవిత, పద్య కవిత, బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం/నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్నింటికి గానీ, కొన్నింటికి గానీ, తమకు నచ్చిన గ్రంథాలను సూచించవచ్చు. అనువాద సాహిత్య, విభాగానికి తప్ప మిగతా విభాగానికి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు సూచించరాదు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించిన గ్రంథాలుండవచ్చు.

అన్ని ప్రక్రియల్లోనూ ప్రామాణికమైన మౌలిక గ్రంథాలే ఉండాలి. కవితా సంపుటిలైతే కనీసం 60 పేజీలు, మిగతా ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గకూడదు. బాల సాహిత్యం, నాటకం ప్రక్రియల్లో పుటల పరిమితి లేదు. తెల్లకాగితంపై పాఠకులు తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు-4 చిరునామాకు నవంబరు 20 లోగా పంపించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో కోరారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement