ఈ నీళ్లు ఏ మూలకు?

16 Feb, 2016 04:08 IST|Sakshi
ఈ నీళ్లు ఏ మూలకు?

సాగర్ నుంచి ఇప్పటివరకు 3.68 టీఎంసీలు విడుదల
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను చేరని తాగునీరు

  
 సాక్షి, విజయవాడ బ్యూరో
:కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటి సరఫరా చేసే విషయంలో జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాగు నీటి కోసం కృష్ణాడెల్టాకు కేటాయించిన 4 టీఎంసీలు ప్రజల అవసరాలకు సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీరు కాల్వల్లో ప్రవహిస్తుందేగానీ, చెరువులకు చేరడం లేదు. కాల్వల విడుదల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అతి తక్కువ పరిమాణంలో నీటిని వదలడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నేడో రేపో సాగర్ నుంచి నీటి విడుదల నిలిపి వేయనున్నప్పటికీ, ఇంకా 10 శాతం చెరువులు కూడా నిండలేదు.

 తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు
కృష్ణాడెల్టా పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న 480 మంచినీటి చెరువులను నింపితే గానీ మార్చి నుంచి ఎదురయ్యే తాగునీటి ఎద్దడి పరిష్కారం కాదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కృష్ణాడెల్టాకు మళ్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా గత శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు 4,981 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుంటూరు చానల్‌కు మరో 43 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి అటు తూర్పు, ఇటు పశ్చిమ డెల్టా కాల్వలకు నీటి విడుదల జరుగుతున్నా తాగునీటి చెరువులు 10 శాతం కూడా నిండలేదు. తూర్పు, పశ్చిమ వైపు ఉన్న రెండు ప్రధాన కాల్వలకూ కనీసం 8 వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వ దిగువ వరకు వేగంగా ప్రవహించే వీలుంటుంది. 5 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రైవస్, ఏలూరు కాల్వలకు 1000, 500 క్యూసెక్కుల చొప్నున  విడుదల చేయడంతో మూడు రోజులుగా నీళ్లు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఇంకా రెండ్రోజులైతేనే చెరువులను చేరతాయి.

 పులిచింతలలో 1.20 టీఎంసీలు...
 నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న తాగునీటిలో 1.20 టీఎంసీలను పులిచింతల రిజర్వాయర్‌లో నిల్వ చేస్తున్నారు. మిగతా నీటిని మాత్రమే కిందకు విడుదల చేస్తున్నారు.  ఈ నీటినే బ్యారేజీ అధికారులు రెండు జిల్లాల తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, పెదకాకాని మండలాల్లోని 100కు పైగా చెరువులకు తాగునీటి అవసరం ఉంది. కేటాయించిన 4 టీఎంసీల్లో ఇప్పటి వరకు 3.68 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 0.32 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఉన్న నీరు సరిపోకపోతే పులిచింతల నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. నీటిని కేవలం తాగు అవసరాలకే ఉపయోగించుకోవాలని, పంటల సాగు, చేపల చెరువుల కోసం వాడకూడదని విజయవాడ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్‌రావు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు