పోతిరెడ్డిపాలెంలో దోపిడీ

18 Nov, 2014 02:31 IST|Sakshi
పోతిరెడ్డిపాలెంలో దోపిడీ

యలమంచిలి : యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం హైవే జంక్షన్‌లో ఆదివారంరాత్రి 1.20 గంటలకు ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ ప్రాంతంలో ఇది తీవ్ర సంచలనమైంది. గుర్తు తెలియని ఐదుగురు ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి దూసుకొచ్చారు. కేకలు పెడితే చంపేస్తామని ఇంటిలోనివారిని బెదిరించారు. భయపెట్టి బీరువాలు, సూట్‌కేసులు తెరిపించి డబ్బు, బంగారం లాక్కున్నారు. దాదాపు అరగంటసేపు నిశిరాత్రి వేళ దొంగలు స్వైరవిహారం చేశారు.

మీరెవరు బాబూ... అని ప్రశ్నించిన పాపానికి వృద్ధురాలి తలపై ఇనుపరాడ్డుతో మోది కుటుంబ సభ్యులందరినీ వంటగదిలో నిర్బంధించి దొరబాబుళ్లా దర్జాగా వెళ్లిపోయారు. 2006లోనూ ఇదే ఇంట్లో ఈ తరహాలోనే దోపిడీ జరిగింది. బాధిత కుటుంబం, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జాతీయ రహదారికి ఆనుకుని రిటైర్డు ఉపాధ్యాయుడు శేఖరమంత్రి పట్నాయక్ కుటుంబం నివసిస్తోంది. అతని కుమార్తె రాధ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో పట్నాయక్ మాస్టార్ భార్య పార్వతి, కుమార్తె రాధ, అల్లుడు నాగుమంత్రి సుధాకర్, ఇద్దరు పిల్లలు గాఢనిద్రలో ఉండగా సుమారు 1.20 గంటల సమయంలో ఐదుగురు వచ్చి తలుపుకొట్టారు. అనుమానం వచ్చిన పట్నాయక్ మాస్టార్ అల్లుడు సుధాకర్ కిటికీలోనుంచి చూసి గట్టిగా అరిచారు. ఆ మరుక్షణమే దొంగలు తలుపులు పగులగొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. వారిలో ఒకరు ఆరు అడుగుల ఎత్తు ఉండి, సైనికుడిలా కనిపించాడని, మిగిలిన వారంతా 25ఏళ్లు వయసు ఉన్న యువకులేనని బాధితులు విలేకరులకు చెప్పారు.

మాట్లాడినా, కేకలు పెట్టినా ప్రాణాలు తీసేస్తామంటూ బెదిరించి, వారిచేతనే ఇంటిలోని బీరువాలు, పెట్టెలు, లాకర్లు తెరిపించారు. బీరువాలో ఉన్న రూ.30వేలు నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు, 3 సెల్‌ఫోన్లు పట్టుకుపోయారు. ఆ సమయంలో మీరెవరని ప్రశ్నించిన వృద్ధురాలు పార్వతి తలపై ఇనుపరాడ్డుతో మోదడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె మెడలోని బంగారు పుస్తెలు తాడును లాగేసుకున్నారు. దొంగల స్వైరవిహారమంతా కేవలం 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. వైద్యం కోసం అప్పుగా తెచ్చిన రూ.30వేలూ పట్టుకుపోయారంటూ బాధితులు విలేకరుల వద్ద వాపోయారు.

ఇంట్లోకి చొరబడిన దొంగల్లో ఒక వ్యక్తి మంకీ క్యాప్ ధరించగా, మరొకడు తువ్వాలు ముఖానికి చుట్టుకున్నాడని, మిగిలిన వారు కర్రలు, స్క్రూడైవర్లు, ఇనుపరాడ్లు తమ వెంట తీసుకొచ్చారని బాధితులు చెప్పారు. ఇంట్లో ఉన్నంతసేపు వారు తమతో తెలుగులో మాట్లాడుతూ వారిలోవారు తమిళంలో మాట్లాడుకోవడం గమనించినట్టు తెలిపారు. ఇంట్లో చోరీ అనంతరం సమీపంలో రైల్వేట్రాక్ వైపు నడుచుకుని వెళ్లిపోయారని తెలిపారు. హైవే సమీపంలో ఉన్న ఇంటిలో దోపిడీతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు