కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

13 Nov, 2017 09:21 IST|Sakshi

- దుండగులతో ప్రతిఘటనలో జారిపడిన ప్రయాణికుడు
బిట్రగుంట:
సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తుతెలియని దుండగులు దోపిడీ చేశారు. అతని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కోవడంతో వారిని ప్రతిఘటిస్తున్న క్రమంలో రైల్లో నుంచి జారిపడి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వేవర్గాల కథనం మేరకు.. తిరుపతికి చెందిన పృధ్వీ అనే యువకుడు కావలిలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. రైలు రద్దీగా ఉండటంతో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్నాడు.

రైలు బిట్రగుంట స్టేషన్‌ దాటిన తర్వాత కిలోమీటరు నంబరు 143-144 మధ్య నెమ్మదిగా వెళ్తుండటంతో పట్టాల పక్కనే వెళ్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న పృధ్వీ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఈ క్రమంలో పృధ్వీ ఫుట్‌బోర్డ్‌ పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వ్యక్తులు మాత్రం సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యారు. గాయపడిన పృధ్వీని స్థానికులు కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రైల్లో కత్తులతో బెదిరించి చోరీ
సూళ్లూరుపేట: కాగా, మరోసంఘటనలో సూళ్లూరుపేట నుంచి చెన్నై వెళ్లే సబర్బన్‌ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో బెదిరించి అయిదు సవర్లు బంగారు చైన్, ఉంగరాలు రూ.6 వేల నగదు రూ.35 వేలు విలువ చేసే రెండు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పోన్లు చోరీ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొరుక్కుపేటై పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన అంజిరెడ్డి సూళ్లూరుపేటలో స్నేహితులను కలిసి.. చెన్నైలో బంధువుల ఇంటికెళ్లేందుకు సబర్బన్‌ రైలు ఎక్కారు. రైలు గుమ్మిడిపూండి దాకే అని అనౌన్స్‌ చేయడంతో అక్కడి నుంచి చెన్నై వెళ్లే మరో సబర్బన్‌ రైలు కదులుతుండగా వెండర్స్‌ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కారు.

అంజిరెడ్డిని గమనించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కూడా అదే కంపార్టుమెంట్‌లో ఎక్కారు. ఆ కంపార్ట్‌మెంట్‌లో ఎవరూ లేకపోవడంతో కవర్‌పేటై-పొన్నేరికి మధ్యలో అంజిరెడ్డికి కత్తులు చూపించి మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు చైన్‌, ఉంగరాలు,  పర్సులోని రూ.6 వేల నగదు, రెండు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పోన్లు లాక్కుని పొన్నేరి రైల్వేస్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో దిగి పారిపోయారు.  జరిగిన విషయాన్ని మీంజూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వగా వారు కొరుక్కుపేటై రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు