చెంఘిజ్‌ఖాన్‌పేట.. అంతస్తులు లేవిక్కడ!

26 Nov, 2017 01:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహారాష్ట్రలోని శని సింగనాపూర్‌ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలోని ఏ ఒక్క ఇంటికీ తలుపులు ఉండవు. అయినప్పటికీ అక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒక్కటీ లేకపోవడం విశేషం! ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడి శనిదేవుడు... శని రూపంలో ఆ దొంగను శిక్షిస్తాడని ప్రజల నమ్మకం. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని చెంఘిజ్‌ఖాన్‌ పేట గ్రామానికీ ఓ ప్రత్యేకత ఉంది. రెండో అంతస్తు కలిగిన భవనాన్ని అక్కడి ప్రజలెవరూ నిర్మించుకోరు!! 

శతాబ్దాల నుంచి...
కొండవీడు కొండల పాదాల చెంతన ఉన్న చెంఘిజ్‌ఖాన్‌ పేట గ్రామ జనాభా 3,500. దాదాపు 500 వరకు ఇళ్లు ఉన్నాయి. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ఆర్థ్ధికంగా స్ధితిమంతులైన ఆ గ్రామ ప్రజలు మంచి మంచి ఇళ్లను నిర్మించుకునే అవకాశం ఉన్నా.. ఏ ఒక్కరూ రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడం లేదు. పెద్ద కుటుంబమైనా మొదటి అంత స్తుతోనే సరిపెట్టుకుంటున్నారు. శతాబ్దాల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. చిల కలూరిపేట సమీపంలోని ఈ గ్రామంలో విద్యావంతులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. అయినా ఎవరూ రెండు అంతస్తుల భవనం నిర్మించేందుకు సాహసించడం లేదు. 

ఆలయ శిఖరం, గాలిగోపుర నిర్మాణం జరగకపోవడంతోనే..
ప్రఖ్యాతిగాంచిన వెన్నముద్దల బాలకృష్ణుని ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. ఎక్కడా కానరాని అరుదైన విగ్రహం ఈ స్వామి వారిది. ఆయన కొలువై ఉన్న ఈ ఆలయానికి శిఖరం, గాలిగోపుర నిర్మాణం జరగలేదు. స్వామివారి ఆలయం ఎత్తు 10 అడుగులలోపే ఉండటంతో ఆ ఎత్తుకు మించి ఇంటిని నిర్మించకూడదని, ఒకవేళ నిర్మిస్తే గ్రామానికి తప్పక ఏదో కీడు జరుగుతుందని వారి నమ్మకం.   

ప్రజల విశ్వాసం..
మా గ్రామంలో ఇప్పటికీ రెండంతస్తుల ఇంటి నిర్మాణం జరగకపోవడానికి ప్రజల విశ్వాసం, భయమే కారణం. వెన్నముద్దల బాలకృష్ణుని ఆలయం ఎత్తుకు మించి ఇంటిని నిర్మించకూడదని మా పూర్వీకుల నుంచి వినపడుతోంది. దాన్నే మేమూ ఆచరిస్తున్నాం. ఒకరిద్దరు రెండు అంతస్తుల ఇంటిని నిర్మించినా, అనతికాలంలోనే కూల్చేశారు. ఆలయానికి శిఖరం, గాలిగోపురం నిర్మించిన తరువాతనే రెండంతస్తుల ఇంటిని నిర్మించుకునే ఆలోచనలో ప్రజలున్నారు.  
    – కొసల శ్రీదేవి, చెంఘిజ్‌ఖాన్‌పేట 

ఆచారాన్ని గౌరవిస్తున్నాం..
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మా గ్రామ ప్రజలు మొదటి అంతస్తు వరకే ఇంటిని నిర్మించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం గ్రామంలో కొత్తగా శివాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయానికి శిఖరం, గాలిగోపురం ఉన్నాయి.    
– సత్యనారాయణాచార్యులు, ఆలయ పూజారి

దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు..
దేవాలయానికి దాదాపు 60 ఎకరాలకుపైగానే వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 20 ఎకరాలు ఆలయ ఉద్యోగులు సాగు చేసుకుంటుండగా, మిగిలిన భూములను రైతులకు కౌలుకు ఇచ్చాం. ఆ భూములకు వస్తున్న కౌలు నామమాత్రంగానే ఉంది. అయినప్పటికీ దేవాలయాన్ని అభివృద్ది చేయడానికి అంచనాలను రూపొందించి దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాము.
– కృష్ణప్రసాద్, దేవాలయ ఉద్యోగి 

మరిన్ని వార్తలు