ఏటీఎం చోరీలకు విఫలయత్నం

11 Jun, 2016 09:36 IST|Sakshi

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో శనివారం తెల్లవారు జామున దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడి విఫలయత్నం చేశారు.

నెల్లూరు నగరంలోని వేదాయపాళెం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు చోరీ చేసేందుకు శనివారం వేకువజామున ముగ్గురు దొంగలు యత్నించారు. ఏటీఎంలోకి చొరబడిన దొంగలు మిషన్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో గస్తీ పోలీసు వాహనం రావడాన్ని గమనించిన వారు పరారయ్యారు. ఏటీఎం నుంచి దొంగలు పరారు కావడాన్ని గమనించిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

మరో ఘటనలో ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండ్ సమీపంలో ఉన్న విజయాబ్యాంక్ చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. షట్టర్ తాళాలు పగులగొట్టి అలారం వైరును కత్తిరించారు. ఈ లోగా జనం అలికిడి విని దొంగలు పారిపోయారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్‌ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్యాంక్ అధికారులకు సమాచారమిచ్చామని పూర్తి వివరాలు తెలియాల్సిందని పోలీసులు చెప్పారు.

 

మరిన్ని వార్తలు