పులికి గిలి

18 Apr, 2019 13:13 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

నల్లమలలో పెద్ద పులుల మృత్యువాత

వన్యప్రాణుల సంరక్షణపై నిర్లక్ష్యం

కర్నూలు, మహానంది:  పెద్దపులి ప్రమాదంలో పడుతోంది. సంరక్షణ చర్యలేవీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఏడు నెలల వ్యవధిలోనే రెండు పెద్ద పులులు మృతిచెందడం ఆందోళన కల్గించే విషయం. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటున్న అటవీ శాఖ అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. నాగార్జునసాగర్‌– శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌  ఫారెస్ట్‌లో వంద దాకా పెద్దపులులు ఉన్నాయి. ఇందులో నల్లమలలోని గుండ్ల బ్రహ్మేశ్వరం (జీబీఎం) పరిధిలో 23 పెద్దపులులు సంచరిస్తున్నట్లు 2018 అక్టోబర్‌ నాటి జాతీయ వన్యప్రాణుల గణాంకాలు తెలుపుతున్నాయి. కర్నూలు–ప్రకాశం జిల్లాలసరిహద్దుల్లోని జీబీఎం రేంజ్‌ పరిధి 1,19,368.46 హెక్టార్లు. అప్పటి లెక్కల ప్రకారం ఇందులో ఐదు మగ పులులు, 15 ఆడపులులు, మూడు పిల్ల పులులు ఉన్నాయి.

అయితే.. నేడు ఇవి  ప్రమాదంలో పడ్డాయి.  కర్నూలు–ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవులే కాకుండా  వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల, సిద్ధవటం వరకు పులులు వెళ్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వివిధ కారణాల వల్ల ఇవి మృత్యువాత పడుతుండడం ఆందోళన కల్గించే అంశం. 2018 సెప్టెంబర్‌ ఒకటిన ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ కాలువలో పెద్దపులి కళేబరం కొట్టుకొచ్చింది. ఇది ఏ కారణంతో చనిపోయిందో ఇప్పటికీ అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు. ఈ ఘటన మరవకముందే మంగళవారం రాత్రి నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రైలుమార్గంలో చలమ వద్ద రైలు ఢీకొని మరొక పెద్దపులి చనిపోయింది. ఇదే ప్రాంతంలో 17 నవంబర్‌ 2018న రైలు ఢీకొని చిరుత కూడా మృతిచెందింది. అంతకుముందు 2018 జనవరిలో పెచ్చెర్వు సమీపంలోని శ్రీశైలం రేంజ్‌లో ఒక పులి మరొక దాంతో ఘర్షణ పడుతూ మృత్యువాత పడింది. అలాగే 2017 డిసెంబరులో వెలుగోడు దగ్గర రెండు పులి పిల్లలు కన్పించాయి. వాటిని రక్షించాలన్న అటవీ శాఖ అధికారుల ప్రయత్నం ఫలించకపోవడంతో ఒకటి మృతి చెందింది. బతికి ఉన్న మరో పులి పిల్లను తిరుపతి ఎస్వీ జూకు తరలించారు.

పులి సంరక్షణకు చర్యలు ఏవీ?
దేశంలోని అతి పెద్ద టైగర్‌ రిజర్వ్‌ కేంద్రాలలో నాగార్జునసాగర్‌– శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఒకటి. రాష్ట్రం విడిపోకముందు ఇది దేశంలోనే అతిపెద్దదిగా ఉండేది. వన్యప్రాణుల సంరక్షణకోసం అటవీ శాఖ కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నా అధికారులు మాత్రం వాటిని సద్వినియోగం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆకలి దప్పులతో అలమటిస్తూ పులులు అడవిని వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా నల్లమలలోని నంద్యాల–గిద్దలూరు రైలుమార్గంలో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. అభయారణ్యంలో ఈ రైలుమార్గం ఉండటంతో ఇక్కడ పులులు, ఇతర వన్యప్రాణులకు ప్రమాదం తలెత్తుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల వేగాన్ని నియంత్రించేలా అటవీ శాఖ అధికారులు రైల్వే శాఖతో మాట్లాడాల్సి ఉంది. అలాగే వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక గేట్లను కూడా ఏర్పాటు చేయాలి. అడవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి మరిన్ని సాసర్‌పిట్స్‌ నిర్మించాలి.

పెద్దపులికి పోస్టుమార్టం
నల్లమలలోని నంద్యాల–గిద్దలూరు రైల్వేమార్గంలో మంగళవారం రాత్రి రైలు ఢీకొని మృతి చెందిన పెద్దపులికి బు«ధవారం పోస్టుమార్టం నిర్వహించారు. అటవీశాఖ సీసీఎఫ్‌ గోపీనాథ్, నంద్యాల డీఎఫ్‌ఓ శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన డాక్టర్‌ రవి, గాజులపల్లె పశువైద్యాధికారి కరుణాకర్‌లు పోస్టుమార్టంలో పాల్గొన్నారు. ఐదేళ్ల వయసున్న ఆడ పెద్దపులిగా గుర్తించామని అధికారులు చెప్పారు.  

నల్లమలలో వేగ నియంత్రణకు రైల్వే అధికారులకు లేఖ రాస్తాం
నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీసీఎఫ్‌ గోపీనాథ్‌ తెలిపారు. ఈ మేరకు నల్లమల అడవిలోని రైలుమార్గం ద్వారా వెళ్లే రైళ్లు నిర్ణీత వేగంలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ అధికారులకు లేఖ రాస్తామన్నారు. 

మరిన్ని వార్తలు