దయచేసి వినండి.. ఈ రైలు ఎప్పుడూ లేటే !

21 Oct, 2019 09:52 IST|Sakshi

సమయానికి నడవని తిరుపతి ప్యాసింజర్‌  

అసౌకర్యానికి గురవుతున్న వెంకన్న భక్తులు 

పట్టించుకోని రైల్వే ఉన్నతాధికారులు 

సాక్షి, గుంతకల్లు: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. తిరుపతి ప్యాసింజర్‌ రైలును కదిరిదేవరపల్లి వరకు పొడిగించడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. కదిరిదేవరపల్లి – తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ రైలు (నం–57477/78)కు  అత్యంత చౌక ధరతో తిరుపతి వెళ్లేవారికి ఎంతో అనుకూలం. దీంతో ఈ రైలు ప్రయాణం పట్ల వెంకన్న భక్తులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఈ ప్యాసింజర్‌ రైలు గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 5.45 వచ్చి 6.00 గంటలకు వెళ్లాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ రైలు ఏ రోజూ కూడా సరైన సమయానికి రాలేదు. గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 7.00లకు పైగా చేరుకుంటుంది. దీంతో నిత్యం వందల మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులతో పాటు  విధులు ముగించుకొని అనంతపురం వెళ్లే రైల్వే ఉద్యోగులు కూడా ఈ రైలు సమయానికి రాకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. గడిచిన మంగళవారం, బుధ, గురు, శుక్రవారల్లో ఈ రైలు గుంతకల్లు జంక్షన్‌కు రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటలకు చేరుకొని అనంతపురానికి రాత్రి 10.30 గంటలపైనే చేరుతోంది.

దీంతో నిత్యం వందలాది మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులు, విధులు ముగించుకొని అనంతపు రం వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ప్రతి రోజూ ఆలస్యంగా ఇళ్లకు చేరుకుంటున్నామని రైల్వే ఉద్యోగులు వాపోతున్నారు. అలాగే గుంటూరు – విజయవాడ రైలు పరిస్థితి కూడా ఇలాగే మారింది.  గుంతకల్లుకు సాయంత్రం 5.00 గంటలకు చేరుకోవాల్సి ఉండగా ఏరోజూ సమయానికి రావడం లేదు. ఇలా గుంతకల్లు మీదుగా నడిచే ప్రతి ప్యాసింజర్‌ రైలు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణించడానికి ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రైల్వే అధికారులు కూడా ప్యాసింజర్‌ రైళ్ల పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్యాసింజర్‌ రైలులో ప్రయాణించి ఆలస్యంగా గమ్యస్థానాలను చేరుతుంటే ప్రత్యామ్నయంగా బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. 

ప్రయాణమంటేనే బేజారు ! 
మాది డోన్‌ . తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్‌ రైలు ఎంతో అనుకూలమాని ఎప్పడూ ఈ రైలులోనే వెళ్తుంటా. అయితే ఎప్పుడు తిరుపతికి వెళ్తినా ఈ రైలు మాత్రం సమయానికి రావడం లేదు. దీంతో ఈ రైలులో ప్రయాణించాలంటేనే బేజారొస్తోంది. ఎప్పుడూ ఇది ఆలస్యంగానే వస్తుంది.             – అనంతరాములు, ప్రయాణికుడు,డోన్‌

ఆలస్యంగా ఇంటికి చేరుతున్నా 
నేను డీఆర్‌ఎం కార్యాలయంలో పని చేస్తున్నా. ప్రతిరోజూ అనంతపురం నుండి గుంతకల్లుకు వస్తుంటా. సాయంత్రం పని ముగించుకొని అనంతపురం వెళ్లేందుకు కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్‌కు వెళ్తా. అయితే ఈ మధ్య కాలంలో రైలు సమయానికి రావడం లేదు. దీంతో రోజూ రాత్రి 10.30 గంటలకు ఇంటికి చేరాల్సి వస్తోంది.  
– వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగి  

మరిన్ని వార్తలు