టీడీఎల్పీ నేత ఎన్నికకు ఏర్పాట్లు

31 May, 2014 02:56 IST|Sakshi
  •      ఎస్వీయూ సెనేట్ హాల్, మహతి ఆడిటోరియాన్ని పరిశీలిస్తున్న అధికారులు
  •      {పజాప్రతినిధుల భద్రతపై పోలీసుల కన్ను
  •  సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన సభ్యులతో జూన్ నాలుగో తేదీన తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేయాలని అధినేత ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సమావేశం ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్, మహతి ఆడిటోరియంను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

    ఆ మేరకు యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ఆదేశాలతో శుక్రవారం సెనేట్ హాల్, మహతి ఆడిటోరియాన్ని అధికారులు పరిశీలించారు. ఈ రెండు చోట్ల అనువైన వాతావరణం ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ భద్రత దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారుల సూచనలు కూడా తీసుకున్న తరువాతనే సమావేశం ఎక్కడ జరిగేది నిర్ణయిస్తారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో అధికారులు రెండు చోట్ల అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

    సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్యులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో పోలీసులు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో తిరుపతిలో పోలీసు నిఘా ఎక్కువ చేశారు. కాగా ఎస్వీయూనివర్సిటీ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు.
     

మరిన్ని వార్తలు