సభలో సమరమే!

5 Mar, 2016 06:44 IST|Sakshi
సభలో సమరమే!

నేటి నుంచి శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు
రాజధాని భూ కుంభకోణం, ప్రజా సమస్యలు,
ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రస్తావించనున్న ప్రతిపక్షం
18 రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ
10న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమల
వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి ప్రత్తిపాటి
స్పీకర్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్న వైఎస్సార్‌సీపీ

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17  ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవ సాయ బడ్జెట్‌ను ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు. బీఏసీ సమావేశం శనివారం జరగనుంది.

 భూకుంభకోణంపై ప్రతిపక్షం గురి
రాజధాని భూముల దురాక్రమణ అంశంతోపాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సన్నద్ధమైంది. సమస్యలను పరిష్కరించలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఏ అంశం కూడా చర్చకు రాకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన రాజధాని భూముల దురాక్రమణ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పడేసింది. ఈ అంశం ఉభయ సభలను కుదిపేసే అవకాశం ఉంది. ప్రతిపక్షం ఇదే అంశాన్ని సభలో ప్రధానంగా ప్రస్తావించనుంది. భూకుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేయనుంది.

 ధరల పెరుగుదల, అవినీతి
తునిలో కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసం, అనంతరం అమాయకులపై కేసుల నమోదు, కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరిస్తున్న తీరు, రాష్ర్టంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం, నిధులు రాబట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, తాగునీటి సమస్య, వ్యవసాయ రంగంలో సంక్షోభం, పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వం ప్రోత్సహించడం, ఒక్కో ఎమ్మెల్యేను రూ.40 కోట్లతో కొనుగోలు చేయడం, అంగన్‌వాడీ కార్మికుల తొలగింపు, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడకేయడం, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి వంటి కీలక అంశాలను సభలో ప్రస్తావించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది.

 ప్రతిపక్ష సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేద్దాం
ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై సభలో చర్చ జరిగే తమకు ఇబ్బందులు తప్పవని అధికార పక్షం ఆందోళన చెందుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి సభను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశాన్ని నేతలకు స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతోపాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభ, శాసన మండలి సభా వ్యవహారాల సలహా కమిటీలు గవర్నర్ ప్రసంగం తరువాత సమావేశమై సభలో చర్చకు పెట్టాల్సిన అంశాలను ఖరారు చేయనున్నాయి. ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు కోరారు.

>
మరిన్ని వార్తలు