విధి విషాదమిది!

21 Nov, 2013 01:52 IST|Sakshi

=పేద కుటుంబంపై పగబట్టిన దురదృష్టం
 =ఏడాదిలో తల్లిదండ్రులు మృత్యువాత
 =తాజాగా అనారోగ్యంతో కుమారుడి మృతి
 =ఒంటరిగా మిగిలిన కుమార్తె
 =బామ్మే తోడూనీడా

 
రావికమతం, న్యూస్‌లైన్: ‘విధి ఒక విషవలయం’ అన్న కవి వాక్కు ఆ కుటుంబం విషయంలో అక్షర సత్యమేమో! కొన్ని బతుకులకు దురదృష్టం వెంటాడి మరీ వేధించి వినోదిస్తుందనడానికి ఆ పేద జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యమేమో.. అందుకే మృత్యువు పగబట్టి మరీ ఆ నిస్సహాయులను వెంటాడింది.  ఒకరి వెంట ఒకరిగా ముగ్గురిని బలి తీసుకుని చోద్యం చూసింది. ముందు తల్లిని, తర్వాత తండ్రిని కబళించిన మృత్యువు ఇప్పుడు కుమారుడినీ మింగేసింది. ఒంటరిగా మిగిలిన బాలిక వేదనతో విలవిలలాడుతూ ఉంటే వినోదిస్తోంది.

రావికమతానికి చెందిన శానాపతి అప్పారావు, అతని భార్య రాజు ఈ ఏడాది నెలల వ్యవధిలో మృతి చెందారు. దీంతో టెన్త్ పాసైన కుమారుడు మణికంఠ (16), ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె అంజలి అనాథలయ్యారు. పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న వారి నాయనమ్మ సోములమ్మపై ఆధారపడ్డారు. బతుకు బండి నడవక పోవడంతో పుట్టెడు దుఃఖంలోనూ మణికంఠ చదువు మాని కిరాణా దుకాణంలో పనికి చేరాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ‘విధి వంచితులు’ శీర్షికన ఈ నెల 16న సాక్షి మానవీయ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

అయితే విధికి ఆ కుటుంబంపై ఇంకా పగ చల్లారినట్టు లేదు. తల్లిదండ్రులను కోల్పోయి, మానసికంగా ఆందోళనకు గురైన మణికంఠ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఆ చెల్లెలు ఒంటరిదైంది. నాయనమ్మతో పాటు అంజలి కన్నీరుమున్నీరవుతోంది. ఆమె విషాదాన్ని చూసి చుట్టాలు, బంధువులే కాదు... గ్రామస్తులూ కంటతడి పెడుతున్నారు. ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదంటూ నిట్టూరుస్తున్నారు. అయిన వారిని కోల్పోయిన అంజలిని ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు