కాటేస్తున్న సారా

21 May, 2015 01:23 IST|Sakshi
కాటేస్తున్న సారా

- నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి
- జీర్ణకోశ, కాలేయ వ్యాధులకు గురవుతున్న గిరిజనులు
పాడేరు/కొయ్యూరు:
మన్యంలో ఏరులై పారుతున్న సారా గిరిజనుల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా చౌకగా దొరుకుతుండడంతో ఆదివాసీలు దీనికి బానిసయి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో తయారీ మూడు పీపాలు ఆరు క్యాన్‌లుగా సాగిపోతోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో కుటీర పరిశ్రమగా ఉంటున్న ఇది ‘సెలైంట్ కిల్లర్’లా అవతరిస్తోంది. దీంతో మారుమూల గూడేల్లో ఎప్పటికప్పుడు చావుడప్పు మోగుతోంది. సారా కారణంగా ఆదివాసీలు జీర్ణకోశ,కాలేయ వ్యాధులకు గురవుతున్నారు. పాడేరు మండలం జోడుమామిడికి చెందిన కొర్రా సుబ్బారావు అనారోగ్యంతో సోమవారం రాత్రి పాడేరు ఆస్పత్రిలో చేరి చనిపోయాడు. లివర్ సిరోసిస్‌తో చనిపోయినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు.

పూటుగా సారా తాగడమే ఇందుకు కారణమని తెలిపారు. కొయ్యూరు మండలంలోనూ సారా కాటుకు ఇద్దరు బలయ్యారు. రోజూ పూటుగా తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఈ మండలంలోని మర్రివాడకు చెందిన పొత్తూరి రమణబాబు(35)చనిపోయాడు. అనారోగ్యానికి గురైన రమణబాబును మంగళవారం రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం తరలించారు. బుధవారం మరణించాడు. ఆదే గ్రామానికి  చెందిన షేక్ బాబ్జి(46) ఇలాగే నాలుగు రోజుల కిందట చనిపోయాడు. మరి కొందరు సారాకు బానిసలై అనారోగ్యంతో విలవిల్లాడుతున్నారు.

మద్యం ధరలకు రెక్కలతో ఏజెన్సీలో సారాతయారీ, అమ్మకాలు విస్తృతమయ్యాయి. మన్యంలో జోడుమామిడి, చింతగున్నెల, వై.సులములు, ఎస్.బొడ్డాపుట్టు, దుమ్మాపుట్టు, ఉరుగొండ, కించూరు, వై.మోదాపుట్టు అటవీ ప్రాంతాల్లో సారా బట్టీల జోరు ఎక్కువైంది. నిషా కోసం ప్రాణాంతకమైన యూరియా, బ్యాటరీ పౌడర్ వంటివి వినియోగిస్తున్నారు. ఇదే ముప్పు తెస్తోంది. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం రవాణాను నిషేధించినప్పటికీ దీని తయారీ, రవాణాను ఎక్సైజ్‌శాఖ నియంత్రించలేకపోతోంది. 20 ఏళ్లు దాటిన యువకుల నుంచి పురుషులు, మహిళలు కూడా దీనికి బానిసలవుతున్నారు.

హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నాం...
సారా కారణంగా గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటివి ఎక్కువ కేసులే నమోదవుతున్నాయి. దీనిపై హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నాం. అయినా మానకపోవడంతో జీర్ణకోశ, లివర్ ఫెయిల్యూర్, లివర్‌సిరోసిస్, నరాల వ్యవస్థ క్షీణించడం, పొట్టలో నీరు చేరడం, అల్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. క్రమేపీ ఆరోగ్యం  క్షీణించి చనిపోతున్నారు.  చాలా చోట్ల మహిళలు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ సరైన తోడ్పాటు ఉండటం లేదు. గ్రామాల్లో చైతన్యం నింపి సారాను అరికట్టాలి.
 - డాక్టర్ పార్థసారధి,
 డిప్యూటీ డీఎంహెచ్‌వో, పాడేరు.

మరిన్ని వార్తలు