కనరో శ్రీవారి దర్శన భాగ్యము 

18 May, 2020 08:23 IST|Sakshi

అవసరమైన ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం 

సాధ్యాసాధ్యాలపై  లోతైన కసరత్తు క్యూలలో సామాజిక 

28న బోర్డు మీటింగ్‌లో తుది నిర్ణయం? 

తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లుపై టీటీడీ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్‌ తరువాత శ్రీవారి దర్శనానికి భక్తులను ఏ విధంగా అనుమతించాలనే దానిపై లోతైన కసరత్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న టీటీడీ ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లుకు పూనుకుంది. 

సాక్షి, తిరుమల: భక్తులను శ్రీవారి దర్శనానికి సామాజిక దూరంతో అనుమతించాలని, సంఖ్యను దాదాపుగా కుదించేందుకు టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించి దర్శనాలకు సంబంధించి విధి విధానాలతో కూడిన నిర్ణయాన్ని తీసు కోనుంది. ఈ విధి విధానాలతో ప్రయో గాత్మకంగా టీటీడీ ఉద్యోగులతో మొదలుపెట్టేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. గంటకు 500 మంది చొప్పున దర్శనానికి అనుమతించనున్నారు. తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను 10 నుంచి 15 రోజులు పాటు దర్శనానికి అనుమతించేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వామివారికి నిత్య కైంకర్యాల సమయం మినహాయిస్తే 14 గంటలు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ దర్శనానికి అనుమతించే భక్తులు సంఖ్యను 7 వేలకు పరిమితం చేయనున్నారు. ప్రయోగాత్మాక పరిశీలన పూర్తయ్యాక స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం కల్పిస్తోంది.  చదవండి:  22న సీఎం చేతుల మీదుగా

ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు? 
శ్రీవారి దర్శనానికి భక్తులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినపక్షంలో టీటీడీ వారికి అవసరమైన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన స్లాట్ల విధానాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా కేటాయించి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి, నడకమార్గంలో భక్తులను క్షుణంగా తనిఖి చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి భక్తుడినీ ధర్మల్‌ స్కానింగ్‌ చేయడంతో పాటు శానిటైజేషన్‌ చేయనున్నారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించేలా నిబంధనలు అమలు చేయనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్‌ కేంద్రాలలో 50 ఏళ్ల లోపు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై నియమించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తిరుమలలో వ్యాపారస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను టీటీడీ నిర్దేశించనుంది. దర్శన విధివిధానాలపై ఇప్పటికే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు  ఈఓ ధర్మారెడ్డి సమీక్షించారు. ఈ నెల 28న నిర్వహించనున్న టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం అధికారికంగా  నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 


 

మరిన్ని వార్తలు