టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

16 May, 2018 12:53 IST|Sakshi
టీటీడీ పాలకమండలి సభ్యులు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన బుధవారం స్థానిక అన్నమయ్య భవన్‌లో 17 మంది సభ్యలతో ఈ సమావేశం జరిగింది. కొత్తగా పాలకమండలి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో అందరూ హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు బోర్డు సభ్యులు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘65 ఏళ్లు పైబడితే అర్చకులు పదవీ విరమణ చేయాలి. వంశపారంపర్యంగా వారి కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తాం. ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ డిపాజిట్లపై సబ్‌కమిటీ నియమించాం.

గత ఏడాది కాలంగా తీసుకున్న 200 తీర్మానాలుకు సంబంధించి 55 తీర్మానాలుకు ఆమోదం తెలిపాం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, చంద్రగిరిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రతీనెల పున్వరసు నక్షత్రాన ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీన మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తాం. తిరుమలలో శుభ్రత పర్యవేక్షణకు కమిటీ వేస్తున్నాం. అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై చర్చ జరిగింది. ఆయన అరోపణలపై వివరణ కోరుతాము. వివరణ ఇచ్చాక తగిన చర్యలు తీసుకుంటాము. ప్రతి ఏడాది ఆభరణాలను గ్రాములతో సహా లెక్కిస్తాం. 65 సంవత్సరాల పైబడిన వారు పదవీ విరమణ అమలు చేస్తే.. రమణ దీక్షితులు కూడా పదవి విరమణ చెయ్యాల్సిదే. 1997లోని చట్టం ప్రకారం సన్నిధి గొల్లలు టీటీడీ ఉద్యోగులుగా మారారు. ప్రస్తుతం 43 మంది మిరాశి అర్చకులు ఉన్నారు’  అని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు