18 ఏళ్ల తర్వాత సంతానం.. కానీ!

23 Nov, 2017 22:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్థానిక ప్రభుత్వ తల్లీపిల్లల ఆస్పత్రిలో కవలశిశువులు మృతి చెందటం ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల ఉదాసీనతే తమ పిల్లల మృతికి కారణమంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ గుణదలకు చెందిన నారాయణ, పార్వతి దంపతులకు వివాహమైన పద్దెనిమిదేళ్ల తరువాత సంతానం కలిగింది. గర్భవతి అయిన భార్యను రెండు రోజుల కిందట ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె గత బుధవారం రాత్రి కవల శిశువులకు జన్మనిచ్చింది. పుట్టిన వారిలో ఒక శిశువు ఉదయం మృతి చెందగా, మరో శిశువు మధ్యాహ్న సమయంలో మృతి చెందింది. శిశువుల పరిస్థితి బాగోలేదని చెప్పినప్పటికీ వైద్యులు నిర్లక్ష్యం గా వ్యవహరించారని తండ్రి నారాయణ ఆరోపిస్తున్నారు.

శిశువులను ఇంక్యుబేటర్ లో ఉంచి సమయానికి చికిత్స అందించి ఉంటే వారు మృత్యువాత పడేవారు కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ చెబుతున్నారు. శిశువులకు తల్లిపాలు పట్టడంతో గాలి ఆడక, ఆక్సిజన్ అందక మృతి చెందారని, అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కూడా ఉండటం వల్ల వైద్యం చేసినా కవల శిశువులు కోలుకోలేక పోయారని వివరించారు. లేకలేక పుట్టిన సంతానాన్ని వైద్యుల నిర్లక్ష్యంతోనే కోల్పోయామని దంపతులు కన్నీరు మున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు