హత్య కేసులో ఇద్దరి అరెస్టు

21 Sep, 2014 03:24 IST|Sakshi
  •  పొలం సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం దాడి
  •  చికిత్స పొందుతూ ఒకరి మృతి
  •  బందరు వెస్ట్ జోన్ పరిధిలో ఈనెల 15న ఘటన
  •  డీఎస్పీ వెల్లడి
  • కోనేరుసెంటర్(మచిలీపట్నం)  :  బందరు వెస్ట్‌జోన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై నమోదైన కేసు లో ఇద్దరు నిందితులను రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం..
     
    శారదనగర్‌కు చెందిన తాడంకి ఆనందరావు బందరు వెస్ట్‌జోన్ పరిధిలోని కొంత అసైన్డ్ భూమిని సాగు చేస్తున్నాడు. దీనిని ఆనుకుని కాలేఖాన్‌పేటకు చెందిన తాడంకి కుమారికి కొంత పొలం ఉంది. వీటి సరిహద్దు విషయమై ఇద్దరూ తరచూ ఘర్షణ పడుతున్నారు. ఆనందరావు గట్లు పేరుతో తన పొలాన్ని ఆక్రమించుకుంటున్నాడని కుమారి ఇటీవల ప్రజావాణిలో జిల్లా అధికారులకు అర్జీ సమర్పిం చింది. తన పొలంలో సర్వే జరిపి హద్దులు నిర్ణయించాలని కోరింది.

    దీనిపై అధికారులు స్పందించి, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి, సర్వేయర్‌తో హద్దులు కొలిపించాలని ఆదేశించారు. తరువాత కూడా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీ సులు వారిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి హద్దులు కొలిచే వరకు ఎవరు వారి వారి పొలాల్లోకి వెళ్లకూడదని స్పష్టంచేశారు. వారివద్ద ఈ విషయమై రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు.
     
    ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఆనందరావు తన పొలంలో నాట్లు వేసే పనులు మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న కుమారి.. పొలంలో సర్వే జరగకుండా ఎలా సాగుచేస్తా డో అడిగి రమ్మని తన మేనల్లుళ్లయిన తాడంకి బోసు, ప్రకాశరావులను పంపింది. వారిద్దరూ పొలానికి వెళ్లి సర్వేయర్ హద్దులు కొలిచే వరకు పనులు నిలిపివేయాలంటూ అడ్డగించారు. దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగింది.
     
    గొడవ ముదరడంతో ఆనందరావు, అతని సోదరుడు వందనరావు పక్కనే ఉన్న కావిడిబద్దతో బోసు తలపై బలంగా కొట్టారు. ప్రకాశరావుపై కూడా ఆనందరావు, అతని అనుచరులు దాడిచేశారు. ఈ ఘటనలో బోసు తలకు బలమైన గాయమైంది. ప్రకాశరావు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న బంధువులు బోసును హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుం బసభ్యులు బోసును విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.

    అక్కడ సకాలంలో వైద్యం అందకపోవటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బోసు అదేరోజు మృతి చెందాడు. ప్రకాశరావు బంద రు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుల కుటుం బీకుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనందరావు, వందనరావులను శనివారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దాడిలో పాల్గొన్న మరికొం దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ ఎస్.వి.వి.ఎస్.మూర్తి, ఎస్సైలు ఈశ్వర్‌కుమార్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు