కల్తీ కాటుకు ఇద్దరు బలి

24 Jan, 2016 03:41 IST|Sakshi
కల్తీ కాటుకు ఇద్దరు బలి

కంపమల్లలో ఇద్దరి మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం

కోవెలకుంట్ల: కల్తీ సారాకు కర్నూలు జిల్లాలో ఇద్దరు బలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. కల్తీ సారా తాగి కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో శనివారం దండు చంద్ర అలియాస్ చంద్రయ్య (28), దాసరి మద్దిలేటి అలియాస్ మద్ది (27) మృతిచెందారు. వీరిద్దరూ శుక్రవారం సారా తాగారని, అది కల్తీ సారా కావడంతో శనివారం ఉదయానికి ప్రభావం చూపి అస్వస్థతకు గురయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు.

 ఆస్పత్రికి తరలించేలోపే మద్ది మృతి చెందగా, చంద్రయ్య నంద్యాలలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరితో పాటు గురువారం రాత్రి సారా తాగిన గ్రామానికి చెందిన రహంతుల్లా, బనగానపల్లెకు చెందిన మరొకరు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎక్సైజ్ అధికారులు గ్రామానికి వెళ్లి వారి మృతికి కారణాలపై ఆరా తీరారు. గ్రామానికి చెందిన కొమ్మెర ఏసన్న అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా గురువారం రాత్రి పెద్దకర్మ నిర్వహించారని, ఈ సందర్భంగా పలువురు సారా తాగారని తేలింది.  మిగిలిన సారాను చంద్రయ్య, మద్ది శుక్రవారం తాగడంతో అది వికటించిందని అంటున్నారు.

అయితే ఈ ఘటనలో వారు సేవించింది నాటుసారానా, ఇథనాల్‌నా లేక స్పిరిట్‌నా  అనే విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు ధృవీకరించడం లేదు. నంద్యాలలో ఉన్న ఫ్యా క్టరీ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలైన కోవెల కుంట్ల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, పాణ్యంలకు స్పిరిట్ రహస్యంగా సరఫరా అవుతోందన్న ఆరోపణలున్నాయి. ఫ్యాక్టరీలో పనిచేసేవారు కూడా బాటిళ్లలో స్పిరిట్ తెస్తుంటారని స్థానికులంటున్నారు.

మూడు నెలల్లో కుమార్తె, భర్త దూరం
మృతి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చంద్రయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. మూడేళ్ల కుమార్తె కీర్తన గత ఏడాది అక్టోబర్ 19న బస్సు కింద పడి మృతి చెందింది. మూడు నెలల వ్యవధిలో కుమార్తె, తండ్రి మృతిచెందటం ఆ ఇంట తీరని విషాదం నింపింది. మరో మృతుడు మద్దికి భార్య, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు