ఇంద‍్రకీలాద్రిపై కలకలం

6 Jun, 2017 20:05 IST|Sakshi
ఇంద‍్రకీలాద్రిపై కలకలం

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై విజిలెన్స్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. అమ్మవారికి దుర్గగుడి లోని మహామంటపం ఆరో అంతస్తులో మహానివేదన తయారు చేస్తుంటారు. ఇక్కడి వంటశాలలో భారీగా ఉన్న బియ్యం, నెయ్యి, పప్పు ధాన్యాలను గుర్తించారు. అమ్మవారి ప్రసాదాల కోసం నిత్యం తీసుకుంటున్న సరుకులను పూర్తిగా వినియోగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సదరు సరుకులు కొందరు ఆలయ ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా విజిలెన్స్ అధికారులకు అందాయి.

ఈ నేపథ్యంలో విజిలెన్స్ సీఐ వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అలాగే అన్నదానం కోసం వినియోగిస్తున్న సరుకులు, స్టోర్స్ రికార్డులను కూడా పరిశీలించారు. దుర్గగుడిలో ఒకవైపు నకిలీ ఉద్యోగుల కుంభకోణంలో పలువురు ఉద్యోగులు, ఉన్నతాధికారులు పోలీసుల నోటీసులు అందుకున్న నేపథ్యంలో తాజాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఆలయ అధికారుల్లో ఆందోళన రేపుతున్నాయి.

ఐఎఎస్ అధికారికి ఆలయ ఇవో బాధ్యతలు అప్పగిస్తే ఆలయం పాలన గాడిలో పడుతుందని భావిస్తే... అందుకు భిన్నంగా వరుస అవకతవకలు బయటపడుతుండటం భక్తుల్లో ఆవేదనకు కారణమవుతోంది. మరోవైపు విజిలెన్స్ అధికారులపై ఇప్పటికే పాత పరిచయాలను ఉపయోగించుకుని విషయం సీరియస్ కాకుండా చూసేందుకు కొందరు ఆలయ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు