విషజ్వరాల విజృంభణ

4 Sep, 2014 00:49 IST|Sakshi
విషజ్వరాల విజృంభణ
  • 5,563 మందికి మలేరియా
  •  93 డెంగ్యూ కేసులు నమోదు
  •  40 మందికి చికున్‌గున్యా
  •  రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు
  • నర్సీపట్నంటౌన్/బుచ్చెయ్యపేట : వాతావరణంలో మార్పులు, అడపాదడపా వర్షాలతో జిల్లాకు జబ్బు చేసింది. ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా విజృంభిస్తున్నాయి. ఏజెన్సీవాసులు మలేరియాతో విలవిల్లాడుతుండగా మైదానం వాసులు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. వందలాది మంది మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నారు.  

    జిల్లాలో 49,26,800 మంది జ్వరపీడితులకు రక్త  పరీక్షలు చేయగా 5,563 మందికి మలేరియా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 93 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 40 మంది చికున్‌గున్యాతో బాధపడుతున్నారు. ఇవన్నీ జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వర్షాలకు గుంటల్లో నీరు చేరి దోమల ఉధృతి పెరిగింది. వాటి రొదతో గ్రామీణులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. పరోక్షంగా వ్యాధులకు గురవుతున్నారు. బుచ్చెయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లోని వారు విషజ్వరాలతో విలవిల్లాడుతున్నారు.

    పెదమదీన, చినఅప్పనపాలెం, తురకలపూడి, రాజాం, చినమదీన, తైపురం, తదితర గ్రామాల్లో 150 మంది మంచానపడ్డారు. కీళ్లు, ఒళ్లునొప్పులు, తీవ్ర జ్వరం, వాంతులు, విరోచనాలతో నడవలేని స్థితిలో అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నా  ఒక పట్టాన నయం కావడం లేదు. రాజాంలో నానిపల్లి ప్రశాంతి, మంత్రి లక్ష్మి, కంఠంరెడ్డి సతీష్, మువ్వల నాయుడు, తురకలపూడిలో కోరుకొండ రాములమ్మ, మంత్రి రామయ్యమ్మ, అలివెల సంతోషి, గంగాభవాని విష జ్వరాలు, వాంతులతో బాధపడుతున్నారు.

    బుధవారం తురకలపూడి పీహెచ్‌సీకి 150 మందికి పైగా వచ్చి సేవలు పొందారు.  వడ్డాది పీహెచ్‌సీకి రోజుకు వందమంది వస్తున్నారు. వడ్డాది, చోడవరం, అనకాపల్లి, రావికమతంల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు రోజూ వందలాది మంది వెళుతున్నారు. చినమదీనలో వైద్య సిబ్బంది బుధవారం  శిబిరం నిర్వహించి సేవలు అందించారు.  20మంది నుంచి  రక్తపూతలు సేకరించారు. 50 మందికి మందులు పంపిణీ చేశారు. లోపూడి, చినఅప్పనపాలెంల్లో సుమారు 150మందికి 104 సిబ్బంది సేవలు అందించారు.
     
    చురుగ్గా రెండో విడత స్ప్రేయింగ్

    నాతవరం : జిల్లాలో రెండవ విడత మలేరియా నివారణకు స్పేయింగ్ చురుగ్గా సాగుతోందని జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు చెప్పారు. నర్సీపట్నం, నాతవరం మండలం మర్రిపాలెం, మాసంపల్లిల్లో  డెంగ్యూ బాధితులను పరిశీలించారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు.   అంతకు ముందు వైద్యాధికారి, సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మలేరియా నియంత్రణకు మొడటి విడతగా 3500 గ్రామల్లో ,రెండో విడతగా 1236 గ్రామాల్లో పిచికారీ చేపట్టామన్నారు. వర్షాలు కారణంగా కొంత అటంకం ఏర్పడుతోందన్నారు.

    ఏజెన్సీలో ఆశ కార్యకర్తలకు మలే రియా కిట్లు ఇచ్చి రక్త పరీక్షలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ముఖ్యంగా దోమకాటు వ్యాధులకు కారణమన్నారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నాతవరంలో కొన్ని ఇళ్లల్లో నీటి నిల్వను, వాటిల్లో దోమలు చేరడాన్ని గమనించారు. ఈ కారణంగానే డెంగ్యూ, చికెన్ గూన్యా జ్వరాలు వ్యాపిస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో నాతవరం వైద్యాధికారి కళ్యాణ చక్రవర్తి, మలేరియా క్లస్టరు అధికారి యాళ్ల కృష్ట ఉన్నారు.
     

మరిన్ని వార్తలు