నామినేషన్ల హోరు | Sakshi
Sakshi News home page

నామినేషన్ల హోరు

Published Thu, Sep 4 2014 12:43 AM

నామినేషన్ల హోరు - Sakshi

 సాక్షి, చెన్నై:స్థానిక ఉప సమరం బరిలో నిలబడేందుకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు హోరెత్తుతున్నాయి. చిన్న చిన్న పదవులకు స్థానికంగా ఉన్న నాయకులు నువ్వా..నేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. ఇక, కార్పొరేషన్ మేయర్లు, మునిసిపాలిటీ చైర్మన్ల పదవులకు అన్నాడీఎంకే అభ్యర్థులు మాత్రం రేసులో ఉన్నారు. బుధవారం ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవుల భర్తీ నిమిత్తం ఉప ఎన్నికల నిర్వహణకు  ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఆ మేరకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి.
 
 తిరునల్వేలి, తూత్తుకుడి, కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ల పదవులకు, శంకరన్‌కోవిల్, పుదుకోట్టై,  విరుదాచలం, అరక్కోణం, కొడెకైనాల్, కున్నూరు, కడలూరు, రామనాథపురం మునిసిపాలిటీ చైర్మన్లు, వెయ్యి వరకు వార్డులు, పంచాయతీలు, యూనియన్ పంచాయతీల సభ్యులు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల పదవుల భర్తీకి గత నెల 29 నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. వార్డుల, పంచాయతీల సభ్యుల పదవులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పార్టీలకు అతీతంగా అనేక చోట్ల స్థానికంగా ఉండే నేతలు నామినేషన్లు దాఖలు చేసి, తమ వ్యక్తిగత సత్తా చాటుకునే పనిలో పడ్డారు. కార్పొరేషన్ మేయర్లు, మునిసిపాలిటీల చైర్మన్లు, వార్డుల పదవులకు ఇప్పటి వరకు అన్నాడీఎంకే మాత్రం అభ్యర్థులను రేసులో దించింది. తాము బరిలో ఉన్నామంటూ బీజేపీ ప్రకటించగా, ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను నిలబెట్టే పనిలో సీపీఎం, ఎస్‌డీపీఐలు నిమగ్నమయ్యాయి. అన్నాడీఎంకేను ప్రత్యక్షంగా ఢీ కొట్టే విధంగా బీజేపీ మిత్రుల మద్దతును కూడగట్టుకునే పనిలో పడింది.
 
 మిత్రుల మద్దతు : డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, ఐజేకే, ఎంఎంకే, పుదియ నిధి, కొంగునాడు తదితర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. డీఎంకే, ఎంఎంకే  తప్ప మిగిలిన పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. నామినేషన్ల గడువుకు గురువారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించేందుకు డీఎండీకే సిద్ధంగా లేదు. ఈ దృష్ట్యా, తమ మద్దతును బీజేపీ అభ్యర్థులకు ఇచ్చేందుకు డీఎండీకే నేత విజయకాంత్ సన్నద్ధం అవుతున్నారు. వారికి మద్దతుగా ఎన్నికల ప్రచార బాటకు రెడీ అవుతున్నారు. దీంతో తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సిద్ధం చేసే పనిలో పడ్డారు. గురువారం బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
 
 అన్నాడీఎంకే అభ్యర్థుల నామినేషన్లు : అన్నాడీఎంకే తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ బుధవారం నామినేషన్లను దాఖలు చేశారు. కోయంబత్తూరు మేయర్ అభ్యర్థి గణపతి రాజకుమార్, తిరునల్వేలి అభ్యర్థి భువనేశ్వరి, తూత్తుకుడి అభ్యర్థి అంతోని గ్రేసీ ఉదయం వేర్వేరుగా తమ తమ ప్రాంతాల్లోని దివంగత నేతలు ఎంజీయార్, అన్నా విగ్రహాలకు పూలమాలలు వేసిన  అనంతరం ఊరేగింపుగా ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లి నామినేషన్లను సమర్పించారు. శంకరన్ కోవిల్ మునిసిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రాజలక్ష్మి, రామనాథపురం-సంతాన లక్ష్మి, కొడెకైనాల్-శ్రీధర్, కడలూరు-కుమరన్, విరుదాచలం-అరుల్ అలగన్, పుదుకోట్టై-రాజశేఖర్, అరక్కోణం-కన్న దాసన్, కున్నూర్-శరవణ కుమార్ తమ తమ మునిసిపాలిటీ పరిధిల్లోని ఎన్నికల అధికారుల వద్ద నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సమర్పణానంతరం ఓట్ల వేటలో పడ్డారు. నామినేషన్లు సమర్పించే చివరిక్షణంలో వార్డుల బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులను మారుస్తూ.. పార్టీ అధినేత్రి జయలలిత తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంతాల్లోని అన్నాడీఎంకే వర్గాలను కలవరంలో పడేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement