వ్యాధులతో విలవిల

28 Aug, 2014 00:14 IST|Sakshi
వ్యాధులతో విలవిల

విశాఖరూరల్: వాతావరణంలో మార్పులతో పరి స్థితి అదుపు తప్పుతోంది. జిల్లా వాసులు వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. విషజ్వరాలు, డెంగ్యూ, చికున్‌గున్యా విజృంభిస్తున్నాయి. మైదా నంలోని వారిని విషజ్వరాలు, చికున్‌గున్యా, డెంగ్యూ పీడిస్తున్నాయి.

బుచ్చెయ్యపేట మం డలం మండలం రాజుపాలేనికి చెందిన ఎన్.మరియమ్మ(20),మాడుగుల మండలం జాలంపల్లికి చెందిన జి.వసంతకుమారి(16),రావికమతం మండలం ఎల్.కొత్తూరుకు చెందిన బి. వరలక్ష్మి డెంగ్యూకు గురయ్యారు. బుచ్చెయ్యపేట మండలం పెదమదీనాలో ఎం.మరిడిబాబు(14),ఎం. కనకరాజు, వై.నాగేశ్వరరావు(10),ఎ.అప్పారావు చికున్‌గున్యాతో బాధపడుతున్నారు.

ఇవి విశాఖ కేజీహెచ్ వైద్యాధికారులు నిర్ధారించినవే. పాడేరు మండలం మారుమూల జోడుమామిడి గ్రామం లో వారం వ్యవధిలో చిన్నారావు, మంగి అనే ఆదివాసీ యువకులు తీవ్ర అనారోగ్యంతో   చనిపోయారు. రావికమతం మండలం కన్నంపేటలో మాయదారి జ్వరాలు వారం రోజుల్లో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న విషయం మరువక ముందే ఇదే మండలం గరిణకంలో ఓ యువకుడు డెంగ్యూ లక్షణాలతో ఈ నెల 23న చనిపోయాడు.

ఆనందపురం పంచాయతీ పొడుగుపాలేనికి చెందిన బంటుబిల్లి శంకర రావు(29) ఇదే లక్షణాలతో మృతి చెందాడు. హుకుంపేట మండలంలో ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మలేరియాతో చనిపోయిన విషయం తెలిసిందే. చోడవరం మండలం అంకుపాలెం పంచాయతీ గోవిందమ్మ కాలనీలో జ్వరంతో బాధపడుతూ తబ్బి తరుణ్(9) ఈనెల 24న ఉదయం చనిపోయాడు. ఇలా రోజురోజుకు జిల్లాలో ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

కశింకోట మండలం నూతన గుంటపాలెంలో 5,రాంబిల్లి మండలం దిమిలిలో 2 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇటీవల 402 మంది అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా 42 మందికి డెంగ్యూ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది పలు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు అదుపులోకి రావడం లేదు.
 

మరిన్ని వార్తలు