విశాఖ- విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభం

1 Oct, 2019 22:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం-విజయవాడల మధ్య మంగళవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) ప్రయాణికులకు మొదటి టికెట్‌ అందజేసి సర్వీసులను ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో విమానయాన సర్వీసులు పునరుద్ధరణ కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

విమాన సర్వీసుల వేళలు..
ఎయిర్‌ ఇండియా విమానం ప్రతి రోజు సాయంత్రం 6.25  నిమిషాలకు హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి 7.30 నిమిషాలకు విజయవాడ వస్తోంది. అదే విమానం రాత్రి విజయవాడలో 7.55 నిమిషాలకు బయలు దేరి 8.55 నిమిషాలకు విశాఖపట్నం చేరుతోంది. మరల విశాఖపట్నం నుంచి రాత్రి 9.20 నిమిషాలకు బయలుదేరి 10.20 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.45 నిమిషాలకు విజయవాడ నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 11.45 నిమిషాలకు హైదరాబాద్‌కు వెళ్తుంది.

సీఎం చొరవతో లైన్‌ క్లియర్‌..
గత ప్రభుత్వ హయాంలో ఎయిర్‌ ఇండియాకు బకాయిలు పడటంతో విమాన సర్వీసులు జూన్‌ 23 నుంచి నిలుపుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్లలో మొత్తం రూ.23 కోట్లు బకాయి పడటంతో విశాఖ-విజయవాడ సర్వీసులకు అంతరాయం కలిగింది. విమాన సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడటంతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రంతో సంప్రదింపులు జరిపి విమాన సర్వీసులు నడపడానికి లైన్‌ క్లియర్‌ చేశారు.

మరిన్ని వార్తలు