హైవేలో ప్రమాదాల నివారణకు కృషి

19 Mar, 2017 17:56 IST|Sakshi

►  అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పి.శ్రీనివాస్‌

మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) : జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పి.శ్రీనివాస్‌ తెలియజేశారు. ప్రమాదాలకు గల కారణాలు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వెల్లడించారు. శనివారం మాధవధారలోని ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో శ్రీనివాస్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా మూడు జిల్లాల పరిధిలో గల హైవేలలో పరిశోధన జరుపుతున్నారు.  విశాఖపట్నం డీటీసీ ఎస్‌.వెంకటేశ్వరరావు నేతృత్వంలో పరిశోధన జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో 114, విజయనగరంలో 33, శ్రీకాకుళం జిల్లాలో 180 కిలో మీటర్ల హైవే కలిగి ఉంది.

మూడు జిల్లాల పరిధిలో ప్రమాదకర ప్రాంతాలు, అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న అంశాలు, రోడ్ల డిజైనింగ్, కల్వర్టుల నిర్మాణం, స్పీడ్‌ బ్రేకర్లు, సిగ్నల్‌ లైట్లు, తదితర అంశాలపై పరిశోధన జరుపుతున్నారు. హైవే నిబంధనల ప్రకారం రోడ్ల నిర్మాణం ఎలా ఉందో పరిశీలించారు. బుధవారం నాటికి సర్వే పూర్తిచేసి డీటీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. నివేదికలో ఆయా అంశాలు, సూచనలకు తగ్గట్టుగా ప్రభుత్వం చొరవ చూపనుందని ప్రకటించారు. ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ పరంగా హైవేలలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్‌.వెంకటేశ్వరరావు, విశాఖ ఆర్టీవోలు ఎ.హెచ్‌.ఖాన్, ఐ.శివప్రసాద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రవాణా అధికారులు, గీతం కళాశాల ప్రొఫెసర్‌ ముకుంద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రొఫెసర్లు రమేషన్‌రాజు, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు