జ్యోతి క్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం 

11 Feb, 2020 05:51 IST|Sakshi
జ్యోతి తల్లిని ఓదారుస్తున్న ఎంపీ గీత

చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడి 

విదేశాంగ మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, జ్యోతి తల్లి

సాక్షి, న్యూఢిల్లీ: చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న టీసీఎల్‌ అనుబంధ సంస్థ ట్రైనీ ఉద్యోగి, కర్నూలు జిల్లా వాసి అన్నెం జ్యోతి క్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. ఆ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ వైఎస్సార్‌సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మెయిల్‌ చేసింది. సోమవారం ఉదయం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్‌లతో పాటు జ్యోతి తల్లి ప్రమీలాదేవి, జ్యోతి బంధువులు అమర్‌నాథ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను కలిశారు.

జ్యోతిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని విన్నవించారు. వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి.. చైనాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. జ్యోతిని కూడా ఫోన్‌ ద్వారా సంప్రదించారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ అండర్‌ సెక్రటరీ ప్రశాంత్‌ కె సోన సోమవారం సాయంత్రం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మెయిల్‌ చేశారు. కుమార్తె కోసం కన్నీటిపర్యంతమైన జ్యోతి తల్లి ప్రమీలాదేవిని ఎంపీ వంగా గీత ఓదార్చారు.

మరిన్ని వార్తలు