‘ఆమె’కు రక్షణేది?

27 Feb, 2014 05:08 IST|Sakshi

ప్రేమ పేరిట విద్యార్థినులపై వేధింపులు.. యువతిపై యాసిడ్ దాడి.. ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. నాలుగేళ్ల బాలిక, వృద్ధురాలిపై లైంగిక దాడి.. ఇలా జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పుడమిపై పడినప్పటి నుంచి కాటికి వెళ్లే వరకూ ఆమె అనుక్షణం చస్తూ బతుకుతోంది. బతుకుతూ చస్తోంది. ఏ వైపు నుంచి ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని అడుగు ముందుకు వేయలేక ముడుచుకుపోతోంది. అబల కాదు.. సబల అని అప్పుడప్పుడు గొంతెత్తుతున్నా.. ఆ స్వరం నొక్కేసే రక్కసులతో పోరాడలేక ఓడిపోతోంది.

మానప్రాణాలను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. ఆడపిల్లగా బతుకునిచ్చినా.. తనను బతకనివ్వడం లేదంటూ కన్నీళ్లు పెడుతోంది. తన ఇష్టాయిష్టాలకు తావు లేకుండా, తనపై మోజుపడ్డ వారిని ప్రేమించపోవడంతో వారి ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోతోంది. తనను ప్రేమించడం లేదంటూ జైపూర్ మండలం కానుకూరు గ్రామానికి చెందిన రవి ఇదే గ్రామానికి చెందిన విద్యార్థిని అనూషపై మంగళవారం రాత్రి కత్తితో దాడి చేసి హతమార్చిన సంఘటన మహిళలకు రక్షణ కరువైందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.             - న్యూస్‌లైన్,మంచిర్యాల రూరల్
 
 కుమిలి‘పోతున్నరు’..
 పల్లె, పట్టణం, కళాశాల, కార్యాలయాలు ఇలా అన్ని చోట్ల ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టి కళాశాల, ఆఫీసుకు వెళ్లే యువతులు, మహిళలపై ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మార్కెట్‌కు వెళ్లినా.. షాపింగ్‌కు వెళ్లినా ఆకతాయిల అల్లరి చేష్టలతో అతివలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రేమ పేరిట వెంట పడి వేధించడం, కాదంటే కన్నెర్రజేసి కడతేర్చడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో యువతులు, విద్యార్థినులు మోసపోయిన సంఘటనలూ ఉన్నాయి. మాయమాటలతో మోసపోయిన కొందరు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలి పోతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

 తల్లిదండ్రుల పాత్రే కీలకం
 మహిళలపై అఘాయిత్యాలు అరికట్టడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని గుర్తించాలి. ఎందుకంటే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇంట్లో వారి ప్రవర్తనను పసిగట్టేది తల్లిదండ్రులే. అబ్బాయిలు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి అలవాట్లు ఎలా ఉన్నాయి, మానసిక ప్రవర్తన ఎలా ఉంటోంది, సమాజంపై వారికున్న అభిప్రాయం, ఇతరులతో వారి స్నేహబంధం ఎలా ఉంటోంది, పెరిగే వయస్సుతో వారి ఆలోచనలు ఏ విధంగా మారుతున్నాయి అనే విషయాలపై దృష్టి సారించాలి. అలా చేస్తే పిల్లలు నేరస్తులుగా మారే అవకాశం ఉండదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు