కేంద్రం వివక్షపై మౌనం ఎందుకు?

13 Mar, 2016 02:56 IST|Sakshi
కేంద్రం వివక్షపై మౌనం ఎందుకు?

 పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్

తెనాలి :  పునర్విభజన చట్టం అమలు చేయకుండా, తగిన ఆర్థిక సహకారం అందించకుండా కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై మౌనం ఎందుకు వహిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పైగా బీజేపీ అగ్రనేతలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చామని చేస్తున్న ప్రకటనలను ఎందుకు ఖండించటం లేదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే రాష్ట్రం కోసం ఐక్యంగా పోరాడదామని ఆయన సూచించారు. తెనాలిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధరను 50 శాతం పెంచి రైతును ఆదుకుంటామని ప్రధాని మోదీ చెప్పినా, కేంద్ర బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదన్నారు.

ఇటీవల రాజమండ్రి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చామని చెపారని, అది అవాస్తవమని టీడీపీ మంత్రులు ఖండించలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. ఆయనతోపాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.దశరధరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు