భర్త ఇంటిముందు భార్య ఆందోళన

22 Sep, 2018 06:52 IST|Sakshi
భర్త ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న శాంతి, ఆమె కుటుంబసభ్యులు

మోసం చేసిన భర్తపై చర్యకు డిమాండ్‌

తూర్పుగోదావరి, చింతూరు: మరో పెళ్లి చేసుకుని తనను మోసగించిన భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భార్య అతడి ఇంటిముందు బైఠాయించింది. బాధితురాలు గిరిజన యువతి పల్లెల శాంతి కథనం ప్రకారం.. మండలంలోని తులసిపాకకు చెందిన శాంతికి చింతూరులో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న సర్వేశ్వరరావుతో 2012లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అదే ఏడాది తెలంగాణలోని మేడారం జాతరలో సర్వేశ్వరరావు తల్లి సమక్షంలో పెళ్లి చేసుకున్నామని ఆమె తెలిపింది. కొన్ని నెలలు సజావుగానే తమ కాపురం సాగిందని, తాను గర్భవతైన నాటి నుంచి భర్త వేధింపులు అధికమయ్యాయని వాపోయింది.

తనను వేరేచోట పెట్టి ఇంటికి యువతులను తీసుకు వచ్చేవాడని, ఈ విషయం తెలిసి తాను ప్రశ్నిస్తే సిగరెట్లతో కాల్చడంతో పాటు ఉరేసి చంపేందుకు యత్నించాడని ఆమె ఆరోపించింది. మూడు నెలల క్రితం తనను తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేయడంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉంటున్నానని, రెండు నెలల క్రితం తెలంగాణాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయాడని ఆమె వాపోయింది. భర్త జాడ గురించి తన అత్తను అడిగితే తనకేమీ తెలియదని చెబుతోందని, దీనిపై చింతూరు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపింది. భర్త మరో పెళ్లి చేసుకుని తనను మోసగించాడంటూ శాంతి శుక్రవారం తన కుటుంబసభ్యులతో పాటు ఏడాది కొడుకు రోహిత్‌తో కలసి భర్త ఇంటిముందు బైఠాయించింది. తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తన ఆందోళన కొనసాగిస్తానని ఆమె తెలిపింది.

మరిన్ని వార్తలు