తీస్తున్న కొద్దీ మద్యం

26 Apr, 2014 02:44 IST|Sakshi
తీస్తున్న కొద్దీ మద్యం

అలమండ(జామి), న్యూస్‌లైన్ : వెతుకుతున్నకొద్దీ మద్యం బాటిళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మండలంలోని అలమండ విజయసీతారామరాజు చెరువు గర్భంలో సుమారు 1500గోవా మద్యం బాటిళ్లను గజ ఈతగాళ్లు, ఎక్సైజ్ సిబ్బంది గురువారం వెలికి తీసిన విషయం విదితమే. శుక్రవారం కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి  ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.

శుక్రవారం మరో 150 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 1,650 బాటిళ్లు బయటపడినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చేపల పెంపకం కోసం చెరువును లీజుకు తీసుకున్న వ్యక్తిపైన, మరికొంతమందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు.

 రాజానవానిపాలెంలో.. వ్యవసాయ బావిలో...
 కొత్తవలస : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు రాజానవానిపాలెంలో ఎం.అప్పలనాయుడుకు చెందిన మామిడితోటలో గోవా మద్యం ఉన్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బావిలో మద్యం సీసాలు ఉన్నాయని, కొంతమంది అప్పుడప్పుడు వీటిని తీసుకుని తాగుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బావిలో సుమారు పది అడుగుల లోతు మేరకు నీరు ఉంది.


ముందుగా ఎస్.కోట ఎక్సైజ్ కానిస్టేబుల్ జైరామ్‌నాయుడు బావిలో దిగి మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. తొలుత ఆయన ఆరు మద్యం సీసాలను బయటకు తీశారు. దీంతో రెండు కిరోసిన్ ఇంజిన్లు రప్పించి నీరు పైకి తోడించారు. బాటిళ్లకు ఉన్న పై కప్పు రంగును బట్టి, అలమండ చెరువులో దొరికిన మద్యం.. ఈ మద్యం ఒక్కటేనని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ బావిలోఉన్న నీటిని తోడారు. ఇంకా నీరు ఉండడంతో అప్పటికి విరమించుకున్నారు.


శనివారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నారు. అలాగే మండలంలోని చినమన్నిపాలెం సమీపంలో ఉన్న చెరువులో కూడా ఇటువంటి మద్యం బాటిళ్లు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమీపంలో ఉన్న చెరువుల గట్టు వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది.

 విజయనగరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్, ఏఈఎస్ కె.వెంకటరామిరెడ్డి, కొత్తవలస ఎక్సైజ్ సీఐ రాఘవయ్య, టాస్కుఫోర్స్ సూపరింటెండెంట్ ఆచారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీధర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్, వీఆర్వో రాధాకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు