సుజలం విఫలం

3 Dec, 2014 00:56 IST|Sakshi
సుజలం విఫలం

అట్టహాసంగా ‘సుజల స్రవంతి’ ప్రారంభం
రెండు నెలలైనా రెండోవిడతకు నోచని పథకం
మొదటి విడతలోనే పూర్తిస్థాయిలో అందని శుద్ధ జలం

 
అర్బన్‌లో నీరు.. అదే తీరు

విశాఖపట్నం సిటీ: విశాఖ అర్బన్‌లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పడకేసింది. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ పథకం సగానికి సగం కేంద్రాల్లో పనిచేయడం లేదు. విశాఖ అర్బన్‌లో ఐదు చోట్లకు గాను నాలుగు చోట్ల మాత్రమే ప్రారంభించారు. హుద్‌హుద్ తుపానుకు నగరంలోని రెండు కేంద్రాలు మూతపడగా, మిగిలిన కేంద్రాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు.

37వ వార్డులోని బాపూజీనగర్‌లో ప్రారంభం కాలేదు. ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. 30వ వార్డులోని అల్లిపురం నేరెళ్లకోనేరు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ పథకం నిర్వహణ సక్రమంగా లేదు. కొద్ది రోజులుగా ట్యాంకులో నీటిని శుభ్రం చేయకపోవడం వల్ల పురుగులు పట్టి అధ్వానంగా ఉండటంతో నీటి కోసం ఎవరూ రావడ ం లేదు.రెండో వార్డు పరిధిలోని ఆరిలోవ డిస్పెన్సరీ వద్ద ఏర్పాటు చేసిన సుజల స్రవంతి ద్వారా రోజుకు కేవలం 200 మందికి మాత్రమే నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మురికి వాడలుండండతో ఎక్కువ మంది ప్రజలు ఎగబడుతున్నారు. కాని రోజుకు వెయ్యి లీటర్లలోపే సరఫరా చేస్తున్నారు.

48వ వార్డు పరిధిలోని మల్కాపురం దరి ఇందిరా కాలనీలో తాగు నీటిని ఇతరులకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. స్థానికులకు 20 లీటర్ల తాగునీటిని రెండు రూపాయలకే అందించాల్సి ఉండగా మినరల్ వాటర్ అమ్ముకునే వారితో కుమ్మకై వారి ట్యాంకులను చౌకగా నింపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లోనే ఈ దందా జరుగుతున్నట్టు చెబుతున్నారు.
     
58వ వార్డులోని పెదగంట్యాడ సమీపంలోని ఫకీర్‌తక్యా కాలనీలో ఏర్పాటు చేసిన సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు కొద్ది మందికే నీటిని సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 తాళ్లపాలెంలో..
 
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో అక్టోబర్ 6న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. తాళ్లపాలెంతో పాటు అమీన్‌సాహెబ్‌పేట, సోమవరం, ఉగ్గినపాలెం, జి.భీమవరం, నరసింగబిల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి టిన్లతో నీటిని తీసుకెళ్తున్నారు. నీళ్ల ట్యాంకు సామర్థ్యం వెయ్యి లీటర్లే అయినందున పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించలేకపోతున్నారు. పథకం నీటి ట్యాంకు సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
 
తగరపువలస : ప్రజలందరికీ సురక్షిత తాగునీరందించడమే ధ్యేయమని ఎన్టీఆర్ సుజలస్రవంతి పేరుతో ఎన్నికల మేనిఫెస్టోతో ఊదరగొట్టిన టీడీ పీ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాతలు దొరకలేదంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.గాం ధీ జయంతి రోజున భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావుచే అట్టహాసంగా ప్రారంభించినా, నియోజకవర్గంలో గంభీరం మినహా మిగతాచోట్ల ఈ పథకం ఇంకా పురుడుపోసుకోలేదు. భీమిలి మండలం చిప్పాడ దివీస్ ల్యాబరేటరీ స్పం దించి మండలంలో 11 చోట్ల ఆర్వోప్లాంట్ల నిర్మాణానికి రూ. 1.32 కోట్లు కేటాయించడమే కాకుండా డిసెంబర్ 20 నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. ఏడాదిపాటు వీటిని నిర్వహించి అనంతరం పంచాయతీలకు అప్పగించాలని దివీస్ యాజమాన్యం భావిస్తోంది.
 
15 నియోజకవర్గాల్లో 19 ఆర్వో ప్లాంట్స్
 
విశాఖపట్నం :   జిల్లాలో 944 పంచాయతీల పరిధిలో 3,285 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో కేవలం 981 గ్రామాల్లో మాత్రమే పీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. 2,149 గ్రామాల ప్రజలు బోర్‌వెల్స్‌పైన, మరో 2,755 గ్రామాల్లో బావులపైన ఆధార పడుతున్నారు. ఎన్టీఆర్ సుజలధారలో తొలుత 232 పంచాయతీలను ఎంపిక చేశా రు. ఈ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు కోసం దాతలుగా 12 పారిశ్రామిక, సేవా సంస్థలను ఎంపిక చేశారు. తొలిదశలో ఐదుకోట్ల 98 లక్షల 83 వేల అంచనాతో 133 ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని చివరి నిమిషంలో దాతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించక పోవడంతో మండలానికొకటి కా దు కదా కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ఏర్పాటు చేసి పరువు నిలబెట్టుకోవాలన్న తలంపుతో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అక్టోబర్2న 19 ఆర్వో ప్లాంట్స్‌ను ప్రారంభించగలిగారు. వీటిలో అత్యధిక ప్లాంట్స్ సామర్థ్యం వెయ్యిలీటర్లే కావడం గమనార్హం. ఇవి కూడా రోజుకు కేవలం 755 కేన్స్(20 లీటర్ల)ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. ఆనందపురం, కశింకోట మండలాల్లో ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్స్‌ను దాతలు నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌ను ఆయా గ్రామ పంచాయతీలే నిర్వహిస్తున్నాయి.అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ ప్రారంభించిన కొద్దిరోజులకే మూలన చేరాయి. మిగిలిన వాటి నిర్వహణ అధ్వానంగా ఉండడంతో మూడు రోజులు పని చేయడం..నాలుగురోజులు మూలనపడ్డం చందంగా తయారైం ది.దీంతో చివరకు రూ.2లకే 20 లీటర్ల మినరల్‌వాటర్ ఒక మిథ్యగా తయారైంది.
 
 

మరిన్ని వార్తలు