ఇక్కట్ల శకటాలు

9 Jan, 2015 02:39 IST|Sakshi
ఇక్కట్ల శకటాలు

అధ్వాన్నంగా ఆర్టీసీ బస్సులు సగం బస్సులు కాలం చెల్లినవే
రోడ్ల విస్తరణ, ప్రమాదకర మలుపుల్లో సూచిక బోర్డులు కరువు
నిత్యం ప్రమాదాలు.. గాలిలో కలుస్తున్న ప్రాణాలు
పట్టించుకోని కాంట్రాక్టర్లు, ఆర్ అండ్ బీ, ఆర్టీఏ అధికారులు

 
కాలం చెల్లిన వాహనాలు.. అస్తవ్యస్థంగా రోడ్లు.. మలుపులు.. డ్రైవర్ల నిర్లక్ష్యం.. పర్యవసానంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  గత ఏడాదికి వందల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సుల్లోనే 113 ప్రమాదాలు జరగగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు వాహనాల ప్రమాద మృతులు వందల సంఖ్యలో ఉన్నారు.  
 
చిత్తూరు :ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం అధికారులకు మామూలైంది. ఆర్టీఏ అధికారులు ఏ మాత్రం పట్టించుకోక పోగా రోడ్డు భవనాల శాఖాధికారులు రోడ్ల భద్రతను గాలికి వదిలారు.  మలుపుల వద్ద,  రోడ్ల విస్తరణ సమయంలో సూచిక బోర్డులు పెట్టడం మరిచిపోయారు. ప్రైవేటు వాహనాల సంగతి దేవుడెరుగు ప్రభుత్వం నడుపుతున్న ఆర్టీసీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. కాలం చెల్లిన బస్సులతో ప్రజల ప్రాణాలను బలిగొంటోం ది. గ్రామీణ ప్రాంతాలకు తగినన్ని బస్సులు నడపకపోవడంతో విద్యార్థులకు టాప్ పైన ప్రయాణాలు తప్పడం లేదు. కాలం చెల్లిన బస్సులు ఎక్కడ ఆగిపోతాయో.. ఎక్కడ నేలకొరుగుతాయో అర్థం కాని పరిస్థితి.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో హర్సీలీహిల్స్ ఘాట్‌లో ప్రమాదాలు తప్పడం లేదు. ఈ ఘాట్‌లో ఎక్కడా ప్రమాదకర సూచికబోర్డులు లేవు. చిన్నేరు ప్రాజెక్టు, తొరకపల్లె ఘాట్,పీటీయం శివాలయం, ములకలచెరువు ప్రాంతాల్లో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో సగానికి పైగా కాలం చెల్లిన బస్సులే. ఒక్కొక్కటి 5లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు. ఒక్క బస్సు కూడా కొత్త బస్సు తిరగడం లేదు.

పుంగనూరు నియోజకవర్గంలో సదుం, సోమల, రొంపిచెర్ల ప్రాంతాల్లో కండీషన్ లేని బస్సులు నడుస్తున్నాయి. కల్లూరు-దామలచెరువు, రొంపిచెర్ల-పీలేరు మార్గంలో కల్వర్టులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. పీలేరు మార్గంలో మూడు సంవత్సరాలుగా కల్వర్టు నిర్మాణం నత్తనడక సాగుతోంది. ఇక్కడ ఎలాంటి సూచికబోర్డులు లేవు. నియోజకవర్గ వ్యాప్తం గా పలు ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు.
     
కుప్పం నియోజకవర్గంలో కుప్పం-కృష్ణగిరి రోడ్డులో వీరప్పనాయని చెరువు వద్ద ప్రతిరోజూ ప్రమాదాలు తప్పడం లేదు. గురువారం కూడా లారీ బోల్తా పడింది. నడుమూరు సరిహద్దు ప్రాంతంలో కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై సూచిక బోర్డులు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 98 బస్సు సర్వీసులకు గాను 28 కాలం చెల్లిన బస్సులు హైదరాబాద్ సర్వీసులు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి.

చంద్రగిరి నియోజకవర్గంలో 42 చోట్ల ప్రమాదకర మలుపులను గుర్తించినా అధికారులు మాత్రం సూచిక బోర్డులను ఏర్పాటుచేయలేదు. రేడియం స్టిక్కర్లు లేవు. పూతలపట్టు రోడ్డులో విస్తరణ పనులు జరుగుతున్నా ఎక్కడా సూచిక బోర్డులు, ఇసుక బస్తాలు వేసిన పాపాన పోలేదు. తలకోన రోడ్డులో కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో 12 రూట్లల్లో బస్సులను నిలిపివేశారు.
     
జీడీనెల్లూరు నియోజకవర్గంలో కార్వేటినగరంలోని పచ్చికాపల్లం రోడ్డు చిన్నకనుమ, పెద్ద కనుమ లోయల వద్ద అధికారులు సూచిక బోర్డులు పెట్టలేదు. గత ఏడా ది ఎన్నికల సమయంలో 30 మంది మృతిచెందారు. పది సంవత్సరాల కాలం ఈ నియోజకవర్గంలో 500 మృతిచెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నియోజకవర్గం మొత్తం 200 మలుపులుండగా వాటికి సూచికబోర్డులు పెట్టలేదు. ఆర్టీసీ చాలా ప్రాంతాలకు బస్సులను నిలిపివేసింది.
     
మదనపల్లె నియోజకవర్గంలో ఇటీవల కాలంలో 23 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరిగాయి. పలువురు మృతి చెందారు. మొత్తం 300 కల్వర్లు ఉన్నాయి. మూడు సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నా సూచిక బోర్డులు లేవు. ఆర్టీసీ బస్సులకు ఇన్య్సూరెన్స్ కూడా లేవు.
     
పీలేరు నియోజకవర్గంలో డిపో పరిధిలో 98 సర్వీసులుండగా 25 కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సక్రమం గా బస్సులు లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా టాప్ ప్రయాణాలు తప్పడం లేదు. చిత్తూరు మార్గంలో ఐటీఐ వద్ద, తిరుపతి మార్గంలోనూ పలు ప్రమాదకర మలుపులున్నాయి. సూచిక బోర్డులు లేవు.
     
పలమనేరు నియోజకవర్గంలో 82 ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా సగం బస్సులు కాలం చెల్లిన బస్సులే. ఇప్పటికే 12 బస్సులు పనికి రాకుండాపోయా యి. మారుమూల రోడ్లల్లో తిరిగే అరకొర బస్సు టాప్‌లపై ప్రయాణాలు తప్పడం లేదు. నియోజకవర్గంలో 10 ప్రమాదకర మలుపులున్నా సూచికబోర్డులు లేవు,
     
పూతలపట్టు నియోజకవర్గంలో చాలా గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు తిరగడం లేదు. 15 రూట్లల్లో బస్సులు తిరుగుతున్నా వాటి కండీషన్ అంతంతమాత్రమే. పా సు ఉన్న విద్యార్థులను బస్సు ఎక్కించుకోవడం లేదు.
     
నగిరి నియోజకవర్గంలో 20 ప్రమాదకరమలుపులున్నాయి. సూచిక బోర్డులు లేవు. 43 పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నాయి. నాలుగు రూట్లకు బస్సులు  రద్దు చేశారు. అధికారులు మాత్రం నియోజకవర్గంలో 8 వేల మంది విద్యార్థులకు పాసులిచ్చారు. టాప్‌పై ప్రయాణాలు తప్పడం లేదు.
     
సత్యవేడు నియోజకవర్గంలో 30 ప్రమాదకర మలుపు ఉన్నాయి. సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేవు. ఆర్టీసీ పరిధిలో 64 బస్సులకు గాను 37 పల్లె వెలుగు బస్సులున్నాయి. మొత్తం బస్సుల్లో సగానికి పైగా కాలం చెల్లిన బస్సులే. నిత్యం ప్రమాదాలు తప్పడం లేదు.
     
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కండీషన్ లేని బస్సులే తిరుగుతున్నాయి. మలుపుల్లో సూచిక బోర్డులు లేవు. కలపాళెం వద్ద జనవరిలో 8 మంది మృతిచెందారు. మామండూరు, చెర్లోపల్లె, నెర్లపల్లె ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
     
చిత్తూరు నియోజకవర్గంలో 122 ఆర్టీసు బస్సులుండగా ఇందులో 70 పల్లె వెలుగు బస్సులున్నాయి. సగానికి పైగా బస్సులు కాలం చెల్లినవే. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు సక్రమంగా నడవడం లేదు.

 
3 వేల మందికి ఓ బస్సు!

 చిత్తూరు అర్బన్: జిల్లాలో దాదాపు 42 లక్షల జనాభా ఉంది. అయితే ప్రజల కోసం నడుస్తున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం 1400. అంటే సగటున ప్రతి మూడు వేల మందికి ఒక ఆర్టీసీ బస్సు కేటాయించారు.  3 వేల మందికి ఒక బస్సు నడపడం సాధ్యం కాకపోవడంతో షేర్ ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు బస్సులు రోడ్డెక్కాయి. ఇప్పటికే నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీలో కొత్త సర్వీసులు తీసుకురావడం, దశాబ్దాల తరబడి సిబ్బంది రిక్రూట్‌మెంట్ ఆగిపోవడం ఆర్టీసీని ఆర్థికంగా కుంగదీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే బస్సులు పుష్కలంగా ఉన్నా ప్రయివేటు వాహనాల పోటీకి ఆర్టీసీ తట్టుకోలేకపోతోంది. ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టే వాహనాలను నియంత్రించడానికి జరిగే దాడులు కూడా నామమాత్రంగా ఉండడంతో ఒకవైపు ఆదాయాన్ని కోల్పోతూ, మరోవైపు ప్రయాణికులకు కావాల్సినన్ని సర్వీసులను అందుబాటులో ఉంచలేకపోతోంది.

 ప్రయాణిలకు ‘సఫర్’

 రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 2006లో ప్రారంభించిన సఫర్ (సేఫ్టీ ఫర్ ఆల్‌వేస్ ఫర్ ఆల్ రోడ్స్) కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. సభలు, ర్యాలీలకే కార్యక్రమం సరిపోతోందని చెప్పవచ్చు.

టార్గెట్ల సాధనకే సమయం

జిల్లా నుంచి ఏటా రవాణాశాఖకు రూ.వంద కోట్లకు పైగా ఆర్థిక వనరులు సమకూర్చాలని లక్ష్యాలు పెట్టడంతో ఖజానా నింపడం తప్ప రహదారి భద్రతా నియమాలను పాటించడంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. నియమ నిబంధనలు పాటించని ఆర్టీసీ బస్సులపై చర్యలు తీసుకుంటే ప్రజా జీవనం స్తంభిస్తుందనే కారణంతో వెనకడుగు వేస్తున్నారు. డిపోలకు వెళ్లి అక్కడ బస్సుల సామర్థ్యంపై సిబ్బందికి అవగాహన కల్పించడం, ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడానికి సాహసిస్తే కాస్త ఫలితం ఉంటుంది.
 
 ఏకాగ్రతతోనే ఉంటాను

 బస్సు డ్రైవింగ్ చేస్తున్నపుడు ఏకాగ్రతతోనే ఉంటాను. ఎదురుగా వచ్చే వాహనాలను, వెనుక నుంచీ వేగంగా వచ్చే వాహనాలను గుర్తించి వాటికి దారి ఇస్తాను. తద్వారా నా వర కు నేను బస్సుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటాను. పుత్తూరు- హైదరాబాదు సర్వీసుకు ఎక్కువగా వెళతాను.   నా 24 సంవత్సరాల సర్వీసులో యాక్సిడెండ్ అనే మాట లేదు. అందువల్లనే ప్రమాదరహిత డ్రైవర్లు మొదటి 10 మందిలో మొదట ఉండటంతో పాటు ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్నాను.  
- ఎస్.వెంకటేశ్వర్లు, డ్రైవర్,

 పుత్తూరు ఆర్టీసీ, డిపో బస్సుల కండీషన్ పరిశీలిస్తాం

 ముందుగా డిపోలోని బస్సుల కండీషన్ ఎలా ఉందనేది ముందుగానే పరిశీలిస్తాం. ఆ తర్వాతనే ఆయా రూట్లకు పంపిస్తాం. ఒక వేళ ఏదైనా తేలిక పాటి సమస్య ఉన్నా బస్సును పంపించే పరిస్థితి ఉండదు. సుమారు 8 వేలమంది విద్యార్థులకు బస్సు పాస్‌లు మంజూరు చేశాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పంపించే పల్లె వెలుగు సర్వీసులు 18 రూట్లలో ప్రతిరోజు నడుపుతున్నాం. కాగా ప్రయాణికులు లేక 4 రూట్లలో సర్వీసులను రద్దు చేశాం. అయితే విద్యార్థులు వెళ్లే రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు ఉన్నా ఒక బస్సులోనే వెళ్లాలని వేచి ఉండి రద్దీగా ప్రయాణించడం మంచిదికాదు. అనుకోని విధంగా జరిగే ప్రమాదాలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది.       - పి.విశ్వనాథ్, మేనేజరు, ఆర్టీసీ డిపో, పుత్తూరు
 

మరిన్ని వార్తలు