సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని సహించను 

4 Jun, 2019 04:07 IST|Sakshi
జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేశారు

ఎంత అవినీతి జరిగిందో నా వద్ద సమాచారం ఉంది

అవినీతి జరిగిన ఆ ప్రాజెక్టుల పనులకు రివర్స్‌ టెండరింగ్‌ 

6న నిర్వహించే సమావేశానికి అవినీతి

జరిగిన ప్రాజెక్టుల వివరాలతో రావాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

‘సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఆయకట్టుకు నీళ్లందించి.. రైతుల మోముపై చిరునవ్వు నింపి.. పేదరికాన్ని నిర్మూలించడమే. తక్షణమే పూర్తయ్యే ప్రాజెక్టుల పనులపై దృష్టి పెట్టండి.. జిల్లాల వారీగా ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించండి. కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం’
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: బంజరు భూములను సస్యశ్యామలం చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతి, అక్రమాలను సహించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు.. మీపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను భారీగా పెంచేయించారు. ఎక్కువ కమీషన్‌లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి భారీ ఎత్తున దోచుకున్నారు. ఆ అవినీతి మచ్చ మీపై పడేలా చేశారు.. దీనివల్లే రాష్ట్ర ఖజానాపై భారీగా భారం పడింది. ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగిందన్న సమాచారం నా వద్ద ఉంది.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.. ఈ నెల 6న నిర్వహించే సమావేశానికి ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగిందో తెలియజెప్పేలా వాస్తవ వివరాలతో రండి.. ఆ ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తాం.. దీనివల్ల ఎంత ప్రజాధనం ఆదా అయ్యిందన్నది ప్రజలకు వివరిస్తాం.. ఈ ధనం ఆదా కావడానికి కారణమైన అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తాం.. ఆదా చేసిన సొమ్ముతో కొత్త ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి దోహదం చేయండి’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రూ.1,57,770 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయని, ఇందులో ఇప్పటివరకూ రూ.62,251 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ సీఎంకు వివరించారు. మిగతా పనులు పూర్తి కావాలంటే రూ.95,519 కోట్లు అవసరమని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో రూ.10,704 కోట్ల విలువైన పనులను ప్రారంభించలేదన్నారు. రూ.7,302.56 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయినా.. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. పనులు ప్రారంభించి 25 శాతం లోపు పనులు పూర్తయిన ప్రాజెక్టుల పనుల విలువ రూ.22,880.44 కోట్లని.. వీటికి రూ.1,191.15 కోట్లు వ్యయం చేశామని.. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.21,681.30 కోట్లు అవసరమని వివరించారు.

ఇదే సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకుంటూ చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పనులను అవినీతిమయం చేశారన్నారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం ఎంత? సెప్టెంబర్‌ 2, 2009 వరకూ ఏయే ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? ఎంత పరిమాణం మేర పనులు పూర్తయ్యాయి? ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ సీఎంల హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు.. ఎంత పరిమాణం మేర పనులు పూర్తయ్యాయి? 2014 నాటికి ఏయే ప్రాజెక్టుల్లో ఎంత పరిమాణం పనులు మిగిలాయి? వాటి వ్యయం ఎంత? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని ఏయే ప్రాజెక్టుల్లో ఎంతకు పెంచేశారు? ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారు.. ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి? ఇప్పటికీ ఎంత పరిమాణం మేర పనులు మిగిలాయి.. వాటి విలువ ఎంత?’ అనే వివరాలతో సమగ్ర నివేదికను ఈ నెల 6 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడకుండా నిజాయతీతో వ్యవహరించి ఉంటే కొన్ని ప్రాజెక్టులైనా పూర్తయ్యేవని, ఆయకట్టుకు నీళ్లందేవని, రైతులకు ప్రయోజనం చేకూరేదని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి, యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టీకరించారు.

యుద్ధప్రాతిపదికన పోలవరం
పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. ఏప్రిల్‌ 1, 2014కు ముందు పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశామని.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక అంటే ఏప్రిల్‌ 1, 2014 తర్వాత రూ.11,537.30 కోట్లు ఖర్చు చేశామని.. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసిందని.. రూ.4,810.04 కోట్లు ఇంకా బకాయిపడిందని ఈఎస్‌సీ ఎం.వెంకటేశ్వరరావు సీఎంకి వివరించారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టుకు రూ.16,673.17 కోట్లు ఖర్చు చేశామని.. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.38,875.7 కోట్లు అవసరమని చెప్పారు. ఇదే సమయంలో సీఎం జోక్యం చేసుకుంటూ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,010.45 కోట్ల నుంచి రూ.55,548.87 కోట్లకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వల్ల అంచనా వ్యయం పెరిగిందని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు వివరించారు. ‘పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రధానంగా పోలవరం హెడ్‌ వర్క్స్‌లో ఏయే కాంట్రాక్టర్లకు ఎంత విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు? చంద్రబాబు ఒత్తిడి వల్ల ఎంత అంచనా వ్యయం పెంచేశారు? రివర్స్‌ టెండరింగ్‌ చేస్తే ఎంత ఆదా అవుతుందన్న వివరాలను ఈ నెల 6లోగా సిద్ధం చేయండి’ అని సీఎం ఆదేశించారు. ‘పోలవరం రాష్ట్రానికి వరప్రదాయిని. ఆ ప్రాజెక్టు పనులు ఆగడానికి వీల్లేదు.

ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చో చెప్పండి.. చంద్రబాబు తరహాలో ఇప్పుడు పూర్తి చేస్తాం.. అప్పుడు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పకూడదన్నది నా ప్రధాన ఉద్దేశం’ అని దిశానిర్దేశం చేశారు. దీనిపై ఈఎస్‌సీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. హెడ్‌ వర్క్స్‌లో ప్రధానమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేస్తున్నామని చెప్పారు. అయితే, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ఈ సీజన్‌లో పూర్తి చేయలేమని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనల మేరకు నిలిపేశామని వివరించారు. వచ్చే సీజన్‌లో కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసి.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులు చేపడతామని తెలిపారు. మొత్తమ్మీద రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇప్పటివరకూ చేసిన కాఫర్‌ డ్యామ్‌ పనులు వరదకు కొట్టుకుపోకుండా, వరద ఉధృతికి ఒక్క నిర్వాసితుడూ ఇబ్బంది పడకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వారంలోనే పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టిసారిస్తానన్నారు.

కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం.. ఆయకట్టుకు నీళ్లందించడమేనని, రైతుల మోముపై చిరునవ్వు చిందేలా చేసి పేదరికాన్ని నిర్మూలించడమేనని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరించారు. కానీ.. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యాన్ని మార్చేసిందని.. చంద్రబాబు జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులను వినియోగించుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ లక్ష్యం సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమేనని స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యయం, మిగిలిపోయిన పనుల ప్రాతిపదికన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో చేపడదామన్నారు. 6న నిర్వహించే సమావేశానికి ప్రాధాన్య ప్రాజెక్టుల వివరాలతో రావాలని కోరారు. జిల్లాల వారీగా ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించడంతోపాటు ఎంత ఖర్చు చేస్తే ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చో తెలుసుకోవాలన్నారు.

యుద్ధప్రాతిపదికన ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని అరికడితే.. ఆదా అయ్యే సొమ్ముతో కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చునని.. కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ముఖ్యమంత్రి కార్యదర్శి సొల్మన్‌ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం తదితరులు పాల్గొన్నారు. కాగా, నీటిపారుదల శాఖపై సమీక్ష సమావేశం జరుగుతుండగానే బయట వర్షం కురిసింది. నిన్న మొన్నటివరకు తీవ్ర సూర్య తాపంతో ప్రజలను అల్లాడించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం నీటిపారుదల అంశంపై సమీక్ష ప్రారంభించిన సమయం నుంచే అందుకు తగ్గట్లుగా వాతావరణం అనుకూలించడం విశేషం.

గోదావరి జలాలతోనే సస్యశ్యామలం
కృష్ణా నదిపై కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుతోందని.. దీనివల్ల నీటి లభ్యత మరింతగా తగ్గుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. గోదావరి నదిలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్న అంశాన్ని గుర్తు చేశారు. ‘ఏటా మూడు నుంచి నాలుగు వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. పోలవరం పూర్తయినా గరిష్టంగా 301 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవచ్చు. గోదావరి జలాలను వృథా కానివ్వకుండా వినియోగించుకుంటే.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చు.. రాష్ట్రమే కాదు తెలంగాణను కూడా సస్యశ్యామలం చేయొచ్చు.

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే తెలంగాణ ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులకు మళ్లించడానికి కూడా సిద్ధమని కేసీఆర్‌ మాట ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ గోదావరి జలాల మళ్లింపుపై ఏవైనా చర్యలు తీసుకున్నారా’ అని ప్రశ్నించారు. దీనిపై ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. గోదావరి–పెన్నా నదుల అనుసంధానంపై వ్యాప్కోస్‌తో అధ్యయనం చేయించామన్నారు. ఈ క్రమంలోనే పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి.. హరిశ్చంద్రపురం ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్‌ కుడి కాలువకు తరలించే పనులు చేపట్టామని.. ఎన్జీటీ తీర్పు వల్ల వాటిని ఆపేశామని చెప్పారు.

ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాలను బకింగ్‌హామ్‌ కెనాల్‌ ద్వారా నెల్లూరు జిల్లాలోని పెన్నా డెల్టాకు తరలించడంపై అధ్యయనం చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. గోదావరి జలాలను తక్కువ ఖర్చుతో భారీ ఎత్తున వినియోగించుకోవడానికి మార్గాలను అన్వేషించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించడంపై అధ్యయనం చేసి.. నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా గోదావరి జలాల వినియోగంపై దృష్టి కేంద్రీకరిద్దామని సూచించారు.

బిజీబిజీగా సీఎం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ కేవీ నాంచారయ్య, బీసీ వెల్ఫేర్‌ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎంటీ కృష్ణబాబుతోపాటు పలువురు ఐఏఎస్‌ అధికారులు సీఎంను కలిశారు. అనంతరం ఉదయం 10.38 గంటలకు వైద్య శాఖపై సమీక్ష ప్రారంభించి మధ్యాహ్నం 12.55 గంటలకు ముగించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీటిపారుదల శాఖపై సమీక్ష ప్రారంభించి సాయంత్రం వరకు కొనసాగించారు. అనంతరం గుంటూరులో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు