నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం: వైఎస్‌ జగన్‌

12 Oct, 2017 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి లక్షా 43వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. దాని ఫలితమే నిరుద్యోగుల ఆత్మహత్యలు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. జీవితం చాలా విలువైంది. మంచి రోజులు వస్తాయి.’ అని వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు.

కాగా ఉన్నత విద్య అభ్యసించి ఏళ్ల తరబడి ఎదురు చూసినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు నిరుద్యోగులు బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బీటెక్‌ పూర్తి చేసిన అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నవీన్‌ (23) ఉరి వేసుకుని, ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన పాలిక గాంధీ అలియాస్‌ శ్రీను(28) పురుగు మందు తాగి తనువు చాలించారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి.

మరిన్ని వార్తలు