వైఎస్సార్‌ హయాం సాగునీటి శకం

8 Jul, 2020 11:05 IST|Sakshi
స్వర్ణముఖి–సోమశిల లింక్‌కెనాల్‌కు రాపూరు వద్ద శంకుస్థాపన చేసిన దివంగత సీఎం వైఎస్సార్, ఎమ్మెల్యే ఆనం, మాజీమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి తదితరులు (ఫైల్‌ )

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు క్యాలెండర్‌లో కొత్త పండగ చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రైతు దినోత్సవం అయింది. ముక్కారు పంటలతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్న సింహపురిలో వైఎస్సార్‌ హయాం సాగునీటి శకంగా మారింది. వ్యవసాయ రంగాన్ని ప్రస్తావించాలంటే క్రీ.పూర్వం.. క్రీ.శకం అన్నట్లుగా దశాబ్దం ముందు వైఎస్సార్, దశాబ్దం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ఈ రోజు పల్లెకు ఆ పండగొచ్చింది. వైఎస్సార్‌ కేవలం ఐదేళ్ల తన పాలనలో వందేళ్ల అవసరాలు తీర్చేలా సాగునీటి రంగం అభివృద్ధికి పునాదులు వేశారు. ఆయన హయాంలోనే కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. మరి కొన్ని పురుడు పోసుకున్నాయి.

జిల్లాలో చారిత్రాత్మకంగా చెప్పుకో దగిన ప్రాజెక్ట్‌ల్లో 78 టీఎంసీ సామర్థ్యం కలిగిన సోమశిల ఒకటి. దాదాపు మూడు దశాబ్దాలుగా 35 టీఎంసీల సామర్థ్యం దాటని ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి  సామర్థ్యానికి పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ రెండోది. సీఎంగా ఉండి నేదురుమల్లినే పూర్తి చేయలేకపోయిన స్వర్ణముఖిని వైఎస్సార్‌ రెండేళ్లలోనే పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. చారిత్రాత్మకమైన నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలకు శ్రీకారం చుట్టితే.. దశాబ్ద కాలంగా పురోగతికి నోచుకోలేదు. వీటిని ఈ ఏడాది ఆఖరులోగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే తెలుగుగంగ, ఎస్‌ఎస్‌ కెనాల్‌తో పాటు ప్రధాన పట్టణాల దాహార్తిని తీర్చేందుకు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.  

సాక్షి, నెల్లూరు: అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురిని జలపురిగా మార్చిన అపర భగీరథుడు. దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు జలయజ్ఞం చేసిన పాలక కర్షకుడు. వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్‌లకు పునాదులు వేసి, పూర్తి చేసిన జలయాజి్ఞకుడు.. రాజశేఖరుడిని దశాబ్దం తర్వాత కూడా జిల్లా రైతాంగం స్మరిస్తోంది. 

  • 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ నిర్వహించిన పాదయాత్ర తర్వాత జిల్లాలో బస్సు యాత్రలో అడుగడుగునా అన్నదాతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు.  
  • 2004లో ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో సాగునీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.  
  • జలయజ్ఞం ద్వారా వందల రూ.కోట్లతో సమగ్ర సోమశిల నుంచి పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం వరకు అన్నింటికి ఆయన అంకురార్పణ చేశారు. 
  • ప్రధానంగా 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకు వచ్చారు.  
  • సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్‌ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు.  
  • జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్‌లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించారు. 

సంగం బ్యారేజీ.. 

  • 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు.  
  • 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు.  
  • అయితే ఆ తర్వాత బ్యారేజీ స్వరూపం మారడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు.  
  • ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహించడంతో పనులు నేటికి సాగుతున్నాయి.  
  • ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించారు. 
  • ప్రస్తుతం 85 శాతం పనులు పూర్తయ్యాయి. 
  • ప్రస్తుతం 1,185 మీటర్ల పొడవు, 84 గేట్లతో దీన్ని నిర్మిస్తున్నారు.  
  • ఇప్పటి వరకు 42 ర్యాంపులకు గాను 38 పూర్తి చేశారు.     
  • బ్యారేజీ పూర్తయితే.. జిల్లాలోని 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహపడుతుంది.పెన్నా డెల్టా లో 2.47 లక్షల ఎకరాలకు, కనుపూరు కెనాల్‌ పరిధిలో 63 వేల ఎకరాలు, కావలి కెనాల్‌ 75 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడానికి దోహదపడుతుంది.  
  •  ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సాగుకు లబ్ధి చేకూరుతుంది. 
  • సోమశిల నుంచి 40 కిలో మీటర్ల దిగువ భాగంలో దీన్ని నిర్మించడం ద్వారా కుడి వైపున నెల్లూరు చెరువు, నెల్లూరు కాలువ, కనుపూరు కాలువ, కనిగిరి ప్రధాన కాలువ, దువ్వూరు కాలువ, కావలి కాలువ పరిధిలోని 3.85 లక్షల ఎకరాల సాగుకు ఇబ్బంది లేకుండా నీటి విడుదల జరుగుతుంది.    

పెన్నా బ్యారేజ్‌..  

  • 2008లో పెన్నా బ్యారేజీ రూ.126 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు.  
  • 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజీని నిర్మిస్తున్నారు.  
  • 0.55 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో తలపెట్టిన పెన్నాబ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా ప్రస్తుతం రూ.149.39 కోట్లకు చేరి 90 శాతం పనులు పూర్తి చేసుకుంది.  
  • దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించడంతో వేగంగా సాగుతున్నాయి.  
  • జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొద్ది నెలల్లో పూర్తయి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తామని ప్రకటించారు.  
  • నెల్లూరు బ్యారేజీ నిర్మాణంతో 5 మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 
  • సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్‌ కాలువల పరిధిలోని ఈ ఆయకట్టుకు పూర్తిగా నీరందుతుంది.  
  • నెల్లూరు నగర తాగునీటి అవసరాలు తీరుతాయి. 
  • నెల్లూరు–కోవూరు రహదారి మార్గంలోనూ పూర్తిగా ఇబ్బందులు తొలగుతాయి.  

35 ఏళ్ల కల.. మూడేళ్లలో సాకారం
వాకాడు: స్వర్ణముఖి నదిపై బ్యారేజీ కం బ్రిడ్జి నిర్మాణం చేయాలనే 50 ఏళ్ల డిమాండ్‌.. 35 ఏళ్ల కలను మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. పాతిక వేల ఎకరాల వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారు. నదీ పరివాహక ప్రాంతమైనా సాగునీటి కొరత కారణంగా కరువు తాండవం చేసేది.  

  • 1972లో స్వర్ణముఖి నదిపై గ్రైయిన్‌ వాల్‌ ఆనకట్ట నిర్మాణానికి అప్పటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుతో రూ.6 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేయించారు. కానీ పూర్తి చేయలేకపోయారు.  
  • 1990లో జనార్దన్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతాంగం కష్టాలు తీర్చాలని  స్వర్ణముఖి నదిపై బ్యారేజ్‌ నిర్మించాలని భావించారు.  
  • 1991లో జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో బ్యారేజ్‌ కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.11 కోట్లతో శంకుస్థాపన చేశారు.  
  • దురదృష్టవశావత్తు బ్యారేజీ పనులు ప్రారంభించకుండానే జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు.  
  • ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
  • 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.  
  • 2005లో వైఎస్సా ర్‌ జలయజ్ఞంలో భాగంగా స్వర్ణముఖి నదిపై రూ. 50 కోట్లు వ్యయంతో బ్యారేజీ కం‡బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  
  • మూడేళ్లలో పనులు పూర్తి చేసి 2008లో బ్యారేజీని రైతులకు అంకితమిచ్చారు.  
  • గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో బ్యారేజీ ఆధారంగా సుమారు 25 వేల ఎకరాల్లో వ్యవసాయం సస్యశ్యామలంగా మారింది.  
  • ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చేశారు. బీడు భూముల్లో సైతం ఏడాదికి మూడు పంటలు పండించి సుభిక్షంగా ఉన్నారు.  
  • ప్రస్తుతం బ్యారేజీ 2 మీటర్లు ఎత్తుతో 34 గేట్లు, 35 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉండే ట్యాంక్‌ ఉంది.  

కరువు నేలపై జలసిరులు 
వెంకటగిరి: కరువు నేలపై జల సిరులు పారించి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. కరువుతో అల్లాడే నియోజకవర్గ రైతాంగ సాగునీటి సమస్యకు శాశ్వత  పరిష్కారం చూపేందుకు ఎస్‌ఎస్‌ కెనాల్, తెలుగుగంగ బ్రాంచ్‌ కాలువలు వంటి భారీ ప్రాజెక్ట్‌లకు పునాదులు పడ్డాయి.    

  • చారిత్రిక ప్రసిద్ధి చెందిన వెంకటగిరిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వెంకటగిరికి పురపాలక సంఘం హోదా కల్పించారు. 
  • రాబోయే 100 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సమస్య తలెత్తకుండా పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందుకు సుమారు రూ.72 కోట్లతో  సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ను తీసుకువచ్చారు. 
  • మెట్ట ప్రాంతమైన వెంకటగిరి రైతులను ఆదుకునేందుకు జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచ్‌ కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు. 
  • వెంకటగిరితో పాటు చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు 2006లో రూ.344 కోట్లు అంచనాతో స్వర్ణముఖి–సోమశిల లింక్‌ కెనాల్‌ నిర్మాణానికి రాపూరులో ఆయన శంకుస్థాపన చేశారు.   
  • వెంకటగిరీయుల సెంటిమెంట్‌ను గౌరవించి విశ్వోదయ కళాశాల స్థలాలను అమ్మబోమని బహిరంగ సభలో ప్రకటించి నూతన కళాశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు.  
  • వెంకటగిరికి అతి చేరువలో మన్నవరం వద్ద ఎనీ్టపీసీ, భెల్‌ ప్రాజెక్ట్‌లు సంయుక్తంగా రూ.6,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎన్బీపీపీఎల్‌ పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత ఆయనదే. 

గూడూరు దాహార్తికి.. శాశ్వత విముక్తి 
గూడూరు: గూడూరు దాహార్తికి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి శాశ్వత విముక్తి కల్పించారు. గూడూరు పట్టణ ప్రజలకు ఎండాకాలం వచ్చిందంటే గొంతెండేది. పట్టణానికి తాగునీరందించేందుకు విందూరు, వేములపాళెం గ్రామాల వద్ద ఉన్న వాటర్‌ వర్క్స్‌ నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. ఎండాకాలంలో తాగునీటి వనరులైన బోర్లు ఒట్టిపోయి పట్టణ ప్రజలు తాగునీటికి అల్లాడే పరిస్థితి. ఈ క్రమంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఇప్పటి వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి గూడూరు పట్టణ ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారని, వారి దాహార్తిని శాశ్వతంగా తీర్చాలంటూ వైఎస్సార్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన 2008లో కండలేరు నుంచి గూడూరుకు పైప్‌లైన్‌ల ద్వారా తీర్చేందుకు రూ.64.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో 2009 కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని తీసుకొస్తున్నారు. వేములపాళెం వద్ద, రిజర్వాయర్‌ ఏర్పాటు చేయడంతో పాటు, శుద్ధి చేసే పరికరాలను,  కండలేరు నుంచి పైప్‌లైను ఏర్పాటు పనులు జరిగి పట్టణ ప్రజల శాశ్వత దాహార్తి తీరింది.    

పల్లెబాట వరం.. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌
సూళ్లూరుపేట: దశాబ్దాల సూళ్లూరుపేట దాహార్తిని మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కమాటతో శతాబ్దానికి సరిపడా తీర్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాలో సూళ్లూరుపేటలో ప్రారంభించిన పల్లెబాటలో స్థానిక నేతలు అడిగిన వెంటనే రూ.6 కోట్లు  మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. వందేళ్లలో పెరిగే పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటికి ఇబ్బందులు రాకుండా కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో సమ్మర్‌ స్టోరేజీని నిర్మించారు. సమ్మర్‌ స్టోరేజీని నింపుకోవడానికి తెలుగుగంగ ఏడో నంబర్‌ బ్రాంచ్‌ కాలువ నుంచి 14 ఆర్‌ కాలువ ద్వారా నీటిని అందించాలనేది వైఎస్సార్‌ ప్లాన్‌. ఆ ప్లాన్‌లో గడిచిన ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. 2012–13లో రూ.117 కోట్లతో నీటి పథకాలు, మరో రూ. 75 కోట్లతో ఇంకో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ మంజూరు చేస్తానని హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. టీడీపీ హయాంలో ఏషియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంక్‌ సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు ప్రతిపాదన మరుగున పడింది. ప్రస్తుతం వైఎస్సార్‌ ఇచ్చిన సమ్మర్‌ స్టోరేజీ మాత్రం పట్టణవాసులు గొంతు తడుపుతోంది.  

అపర భగీరథుడు 
సైదాపురం: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో గంగ జలాలను సైదాపురానికి తీసుకువచ్చిన అపర భగీరథుడు. మెట్టప్రాంతానికి కండలేరు జలాలను తెప్పించి తద్వారా బీడు భూములను మాగాణి భూములుగా మార్చారు. సుమారు 23 వేల ఎకరాల భూములు నేడు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జలయజ్ఞం ద్వారా గంగ బ్రాంచ్‌ కాలువలను నిర్మాణానికి నిధులను పుష్కలంగా విడుదల చేశారు. కండలేరు నుంచి 2ఏ బ్రాంచ్‌ కాలువ నిర్మాణానికి నిధులను విడుదల చేశారు. 2ఏ నిర్మాణ ద్వారా ఈ ప్రాంతంలోకి గంగ నీరు వచ్చి చేరుతుండటంతో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. సుమారు 15 వేల ఎకరాలు సాగవుతోంది. గతంలో వర్షాధారంగా ఆధారపడి ఉన్న రైతులకు 2ఏ బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ప్రతి చెరువుకు సాగు నీరు అందించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. అలాగే 2 బీ కెనాల్‌ ద్వారా మరో 7 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. 

సమగ్ర సోమశిల
సాక్షి, నెల్లూరు: సింహపురి సిగలో జలనిధి ఉన్నా.. వ్యవసాయానికి సాగునీటి కరువు వెంటాడేది. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్న సోమశిల ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యాక జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండేళ్లలోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సంకలి్పంచారు. వైఎస్సా ర్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులను పూర్తి చేసి 2007 నాటికి 72 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అంకితమిచ్చి చెరగని ముద్ర వేసుకున్నారు.  

మూడు దశాబ్దాల తర్వాత..  
పెన్నానదికి ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురిసిన వర్షాలకు జలాశయాలు నిండి వృథాగా సముద్రంలో కలుస్తుంటే కరువు ప్రాంతాల గొంతు తడపాలన్న ప్రయత్నమే జిల్లాలోని సోమశిల జలాశయానికి పునాది పడింది. 

  • సోమశిల ప్రాజెక్ట్‌ ద్వారా మొత్తం 5,84,500 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ప్రతిపాదన చేశారు. ఇందులో 4,05,500 ఎకరాలు మాగాణి భూముల స్థిరీకరణతో పాటు కొత్తగా 1,79,000 ఎకరాల  ఆయకట్టును స్థిరీకరించారు.   
  • నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల వద్ద పెన్నానదిపై జలాశయం నిర్మించేందుకు 1973లో ఐదో పంచవర్ష ప్రణాళికలో రూ.17.20 కోట్ల అంచనాలతో అనుమతులు ఇచ్చారు.  
  • అన్ని అనుమతులతో ఈ ప్రాజెక్ట్‌ 1976లో ప్రారంభమైనప్పటికీ పనులు పురోగతిలో లేకుండాపోయాయి.  
  • 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టినా.. 1989 నాటికి కూడా ప్రాజెక్ట్‌ ముఖ్య నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారు.  
  • వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు ఎనీ్టఆర్‌ 1983లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ప్రారంభించారు.  
  • కరువు ప్రాంతాల కడగండ్లు తీర్చడానికి ఆ నీళ్లు సరిపోవని బచావత్‌ ట్రిబ్యునల్‌ కాదన్నా, అప్పటి తెలంగాణ నాయకులు జలదోపిడీ విమర్శలు చేసినా లెక్క చేయకుండా 2005 సెపె్టంబర్‌ మహానేత వైఎస్సార్‌ జీఓ 170 ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నీటి తరలింపు సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1,10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా డిజైన్‌ చేయించారు. 
  • ఆ నాటి కృషి ఫలితమే నెల్లూరు జిల్లాలో వర్షాలు కువరకపోయినా రైతాంగం ధీమాగా పంటలు పండించుకొనే పరిస్థితి వచ్చింది.   

జగన్‌  హయాంలో కల సాకారం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సమగ్ర సోమశిల ముఖచిత్రం మారింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూములకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటేందుకు రూ.450 కోట్లు ఆ శాఖకు కేటాయించారు. ఇప్పటి వరకు సోమశిలకు భారీ వరదలు వచ్చినా కేవలం 73 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచేవారు.  మిగిలిన 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు లభించలేదు. కొత్త ప్రభుత్వం రాకతో అటవీ భూములకు పరిహారం కొలిక్కి రావడంతో 78 టీఎంసీల నీరునిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది కురిసిన వర్షాలకు 78 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది.   

మరిన్ని వార్తలు