సాగు నీటిలో నవచరిత్ర | Sakshi
Sakshi News home page

సాగు నీటిలో నవచరిత్ర

Published Thu, Nov 2 2023 4:31 AM

CM Jagan, Shekawat to Start Prestigious ICID conference in Visakha - Sakshi

ర్యాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ వేదికగా దేశంలో 57 ఏళ్ల తరువాత ప్రతిష్టాత్మక సదస్సు.. దేశ విదేశాల నుంచి నగరానికి చేరుకున్న ప్రతినిధులు 5న తాటిపూడి రిజర్వాయర్, ఆయకట్టు నీటి సరఫరా పరిశీలన నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు ప్రధాన అజెండా ఏటా కోటి ఎకరాలకుపైగా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర సాగు, ఆహార భద్రతే లక్ష్యంగా అన్నదాతకు దన్నుగా అడుగులు

సాక్షి, అమరావతి: సాగునీటి ఎద్దడిని అధిగమించి మానవాళికి ఆహార భద్రత చేకూర్చడమే అజెండాగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ (ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌) 25వ సదస్సును జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించను­న్నారు. ఐసీఐడీ ఛైర్మన్‌ డాక్టర్‌ రగబ్‌ అధ్యక్షతన ఈ నెల 8వతేదీ వరకు జరిగే ఈ సదస్సులో సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక దిగుబడులను అందించే వ్యవసాయ సాంకేతిక విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు దీనికి హాజరు కానుండగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం (సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేయడం, మురుగు నీటిని శుద్ధి చేయడం తదితరాలు), తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక ఉత్పాదకత విధానాలపై పరిశోధన నివేదికలను సదస్సులో సమర్పించి చర్చించనున్నారు. ఈ అంశాలపై రెండు అంతర్జాతీయ సెమినార్లు, అంతర్భాగంగా పది కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

4న అవార్డుల ప్రదానోత్సవం
ప్రపంచవ్యాప్తంగా జల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థలకు, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపికైన ప్రాజెక్టులకు ఈనెల 4న అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గోస్తని నదిపై 1963–68 మధ్య 3.175 టీఎంసీల సామర్థంతో నిర్మించిన తాటిపూడి రిజర్వాయర్‌ను ఈనెల 5న ఐసీఐడీ ప్రతినిధుల బృందం పరిశీలించి నీటి పారుదల వ్యవస్థను అధ్యయనం చేయనుంది. సదస్సు ముగింపు సందర్భంగా ఈనెల 8న ఐఈసీ (ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ) 74వ సమావేశాన్ని నిర్వహిస్తారు. అదే రోజు ఐఈసీ ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. 9న ఐసీఐడీ ప్రతినిధులు అరకు వ్యాలీని సందర్శించడంతో సిల్వర్‌ జూబ్లీ (25వ వేడుక) కాంగ్రెస్‌ పూర్తవుతుంది. 

57 ఏళ్ల తర్వాత విశాఖ వేదికగా
అంతర్జాతీయంగా సుస్థిర సాగునీటి నిర్వహణ లక్ష్యంగా 1950 జూన్‌ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ 1951 జనవరి 11–16 వరకు ఢిల్లీలో జరిగింది. మన దేశంలో చివరిగా ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ 1966  జనవరి 4–13 వరకూ జరిగింది. సంస్థ ఆవిర్భవించిన 57 ఏళ్ల తరువాత సిల్వర్‌ జూబ్లీ వేడుకలు విశాఖలో జరగనుండటం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక  సదస్సును కేంద్ర జలసంఘం, కేంద్ర జల్‌ శక్తి శాఖ, ఇన్‌సిడ్‌(ఇండియన్‌ నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఐసీఐడీ సిల్వర్‌ జూబ్లీ కాంగ్రెస్‌కు విశాఖ అందంగా ముస్తాబైంది. సదస్సును ర్యాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ వేదికగా నిర్వహించనున్నారు. 

సర్కారు చిత్తశుద్ధికి దక్కిన గౌరవం
నదీ జలాలను ఒడిసి పట్టి భూగర్భ జలాలను సంరక్షిస్తూ మెరుగైన యాజమాన్య పద్ధతులలో అధిక ఆయకట్టుకు నీళ్లందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2019లో రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించి రికార్డు నెలకొల్పారు. అదే ఒరవడితో 2020, 2021, 2022లోనూ కోటి ఎకరాలకు నీళ్లందించి అన్నదాతలకు దన్నుగా నిలిచారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందిస్తున్నారు.

రాష్ట్రానికి జీవనాడి పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. సూక్ష్మ నీటిపారుదల (డ్రిప్, స్పింక్లర్లు) విధానాలకు పెద్దపీట వేస్తున్నారు. సాగునీటికి సీఎం జగన్‌ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఐసీఐడీ సిల్వర్‌ జూబ్లీ సదస్సును ఆంధ్రప్రదేశ్‌లో  నిర్వహించాలని నిర్ణయించింది. ఇది సుస్థిర సాగునీటి నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. 

ఆహార భద్రతకు ప్రాధాన్యం
అధిక ఆయకట్టుకు సుస్థిరంగా సాగునీటిని అందించి ఆహార భద్రత చేకూర్చడమే లక్ష్యంగా సీఎం జగన్‌ నీటిపారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఐసీఐడీ సిల్వర్‌ జూబ్లీ కాంగ్రెస్‌ నిర్వహణకు విశాఖను వేదికగా ఎంపిక చేసింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర నీటిపారుదల రంగంలో నవ చరిత్రను లిఖిస్తాం. సీఎం జగన్‌ నేతృత్వంలో ప్రపంచంలో అత్యత్తుమ నీటిపారుదల విధానాలను ఈ సదస్సు ద్వారా అందిపుచ్చుకుని రైతులకు బాసటగా నిలుస్తాం.
– శశిభూషణ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి 

అత్యుత్తమ నీటి విధానాలే లక్ష్యం
సుస్థిర సాగునీటి నిర్వహణతో రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. అందులో భాగంగానే వరద నీటిని ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే ప్రాజెక్టులు చేపట్టాం. పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ నీటిపారుదల విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన. 
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, జలవనరుల శాఖ

నేడు విశాఖ సదస్సుకు సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విశాఖలోని రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌లో మొదలయ్యే 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం ఉదయం 7.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. సదస్సుకు హాజరైన అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.  

Advertisement
Advertisement