ప్రమాదం జరిగిన తీరిదీ..

25 Apr, 2014 01:04 IST|Sakshi

బుధవారం సాయంత్రం 4.40 గంటలు: నంద్యాలలో షర్మిల వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొనేందుకు శోభా నాగిరెడ్డి అవుట్‌లాండర్ కారులో (నంబర్ ఏపీ21 ఏఎఫ్ 0001) ఆళ్లగడ్డ నుంచి 45 కి.మీ. దూరంలోని నంద్యాలకు వచ్చారు.
 
 రాత్రి 9.30: జనభేరి సభ ముగిసింది.
 
 రాత్రి 10.35: శోభానాగిరెడ్డి నంద్యాలలో భోజనం చేసి  ఆళ్లగడ్డకు బయలుదేరారు.  ఆమె కారు ముందు సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో ఇద్దరు గన్‌మెన్లు కూర్చున్నారు. కారు వెంట రెండు ఎస్కార్టు వాహనాల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు.
 
 రాత్రి 11.20: ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలోని గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యం (వడ్లు) రాశికి అడ్డంగా పెట్టిన రాళ్లను తప్పించబోయి డ్రైవర్ కారును ఎడమవైపు తిప్పడంతో నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రధాన రోడ్డు నుంచి 100 మీటర్ల దూరం వరకు పోయి కారు ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో శోభా నాగిరెడ్డి ముందున్న అద్దంలో నుంచి ఎగిరి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి.
 
 రాత్రి 11.30: కారు వెనుక వస్తున్న మరో వాహనంలోని అనుచరులు (వీరు నంద్యాలలోని షర్మిల జనభేరి సభకు వెళ్లి వస్తున్న వారు) ప్రమాదాన్ని గుర్తించి ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన 10 నిమిషాల తర్వాత ఎస్కార్ట్ వాహనాలు చేరుకున్నాయి.
 రాత్రి 11.40: ప్రథమ చికిత్స అనంతరం శోభా నాగిరెడ్డిని అంబులెన్స్‌లో నంద్యాలకు తీసుకెళ్లారు.
 
 రాత్రి 12.35: నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడ దాదాపు 3 గంటల పాటు వైద్యులు సేవలందించినా ఫలితం లేకపోయింది.
 
 గురువారం తెల్లవారుజామున 2.50: మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు.
 
 ఉదయం 5.30: బీచ్‌పల్లి వద్ద అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ నుంచి వచ్చిన మరో వాహనంలోకి మార్చారు.
 ఉదయం 7.10: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు.
 
 ఉదయం 11.05: వెంటిలేటర్‌పై వైద్య సేవలందించిన వైద్యులు చివరకు శోభా నాగిరెడ్డి మరణించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
 - కర్నూలు, సాక్షి


 

మరిన్ని వార్తలు