కలకలం

14 Mar, 2015 02:41 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ దృష్టికి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి అసెంబ్లీలో శుక్రవారం తీసుకెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమాన పరచడంపై కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 168 నిబంధనల ద్వారా విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఆ మేరకు స్పీకర్ నోటీసు స్వీకరించారు. ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చారు.

 

ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కలెక్టర్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. పైగా అందరూ ఆహ్వానితులేనని ఆహ్వాన పత్రంలో ముద్రించారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల చెంతకు చేరుతున్నారని తెలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్షంగా ఏర్పడి పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వాస్తవ విషయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రికి వివరించి నిధులు కోరాలని భావించారు.
 
  అలాంటి పరిస్థితిలో జమ్మలమడుగు నియోజకవర్గం గుర్రప్పకోన వద్ద పోలీసుల ద్వారా ఎమ్మెల్యేలను, అఖిలపక్షం సభ్యుల్ని అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులుగా తమ హక్కులకు భంగం కల్గించడం ఏమాత్రం సరైంది కాదని వివరించారు. ప్రజల కోసం, మెట్టప్రాంతం ఉన్నతి కోసం వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి విన్నవించాలనే ఉద్దేశంతో ఉన్నామని ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కలెక్టర్‌కు అక్కడి నుంచే ఫోను ద్వారా విన్నవించినా ఫలితం లేకపోయింది.
 
 కలెక్టర్‌పై తొలిసారి..
 వైఎస్సార్ జిల్లా చరిత్రలో కలెక్టర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేయడం తొలిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు. కలెక్టర్‌గా పనిచేస్తున్న జయేష్‌రంజన్ బదిలీ నేపథ్యంలో.. ఆయన బదిలీ అపాలంటూ ఉద్యమం చేసిన చరిత్ర జిల్లాలో ఉంది. ప్రస్తుత కలెక్టర్ తీరుతో విసిగి పోయి.. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రౌండు టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ‘ఈకలెక్టర్ మాకొద్దు’ అని మూడు రోజుల క్రితం తీర్మానం చేశాయి.
 
 అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు కడప జిల్లా అంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, భూములు ఇస్తామన్నా ముందుకు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది. ఇక్కడ పెట్టుబడులకు భద్రత ఉండదనే భయంతో ఉన్నారని, ఇక్కడి ప్రజలు ఆవేశపరులు అంటూ మాట్లాడటం జిల్లా వాసులను ఆవేదనకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ కలెక్టర్‌ను ప్రభుత్వం వెనక్కు పిలిపించుకుని మరో సమర్థుడైన కలెక్టర్‌ను నియమించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
 
 తొలి నుంచి వివాదస్పదమే..
 జిల్లా కలెక్టర్‌గా కెవీ రమణ జూలైలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో రాజంపేట హైస్కూల్‌లో ఆర్థర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచారణకు వెళ్లిన కలెక్టర్ గురువులు ‘గిచ్చడం’ విద్యాభివృద్ధి కోసమే అని మాట్లాడి వివాదాస్పదమయ్యారు. ప్రాంతీయ స్పోర్ట్సు స్కూల్ విద్యార్థులు అప్పటి స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి వైఖరికి నిర సనగా ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. డిప్యూటి డిఈఓ, పరిశ్రమల జిఎంలను ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్‌ను కలెక్టర్ పక్కలో కూర్చోబెట్టుకొని ఆరోపణలు తప్ప ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వడం అప్పట్లో దుమారం లేపింది. అంతేకాకుండా విద్యార్థుల ఆందోళనకు యోగ, తెలుగు టీచర్లు డాక్టర్ రంగనాథ్, బాస్కర్‌రెడ్డిలు కారకులంటూ సస్పెన్షన్ చేశారు. బద్వేల్‌లో ప్రభుత్వ ఆస్పత్రిని మార్చొద్దని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రజల పక్షాన ఏకంగా ఎమ్మెల్యే జయరాములు నిరహార దీక్ష చేపట్టారు.
 
  ఇప్పుడున్న ఆస్పత్రి 10 ఎకరాల్లో ఉందని, ఆ స్థలం అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందని, రూ.2కోట్లు నిధులు మంజూరయ్యాయని మొత్తుకున్నా విన్పించుకోలేదని బద్వేలు వాసులు వాపోతున్నారు. అయితే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అన్నట్లుగా కలెక్టర్ సీమాంక్ ఆస్పత్రిలోకి ఆస్పత్రిని మార్చారు. ప్రస్తుతం చర్చి నుంచి 60 అడుగుల రహదారి (ఆస్పత్రికి వెళ్లడానికి) ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని క్రిష్టియన్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ తీరుపై అన్ని వర్గాల వారి నుంచి నిరసన వ్యక్తమవుతుండగా అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంపై జోరుగా చర్చ సాగుతోంది.
 

మరిన్ని వార్తలు