మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్‌

16 Jul, 2019 04:08 IST|Sakshi

అసెంబ్లీలో సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశంసలు

ప్రజా సంక్షేమం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ దృఢచిత్తానికి నిదర్శనం

ప్రజలు మెచ్చుకున్న పార్టీ మేనిఫెస్టోను ప్రతిఫలించిన బడ్జెట్‌

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు, వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా శ్రేయోదాయకమైన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో స్వయంగా చూసిన ప్రజల కష్టాలను తీర్చేందుకు, పేదల కన్నీళ్లను తుడిచేందుకు మార్గాన్ని సుగమం చేసేలా బడ్జెట్‌ ఉందని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర స్ఫూర్తి బడ్జెట్‌లో ప్రతిఫలించిందన్నారు.

ఏడ్చే బిడ్డను తల్లి తన ఒడలోకి తీసుకుని ఎలా ఓదారుస్తుందో అదే విధంగా అక్షరాస్యతకు దూరంగా ఉన్న పిల్లలను సీఎం వైఎస్‌ జగన్‌ తన ఒడిలోకి తీసుకుని వారికి విద్యను అందించడానికి అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారన్నారు. ప్రభుత్వం రూ.28 వేల కోట్లతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌తో, రైతు భరోసా పథకంతో రాష్ట్రంలోని రైతులకు ధైర్యం వచ్చిందని చెప్పారు. కౌలు రైతుల గురించి ఆలోచించిన మొట్టమొదటి సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు భూసేకరణ కోసం బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించడం రాష్ట్రంలో గొప్ప మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఎందుకు ఓడారో బాబుకు తెలీదట
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా ప్రజలను సమ దృష్టితో చూశారా అని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రజల్ని పౌరులుగా కాకుండా ఓటర్లుగానే చూసి పాలించారని ఆయన విమర్శించారు. పసుపు చొక్కా వేసుకుంటేనే పథకాలు అందిస్తామన్నదే ఆయన సిద్ధాంతమని దుయ్యబట్టారు. బడ్జెట్‌ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘అవును మా బడ్జెట్‌ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలానే ఉంది. అందులో తప్పేముంది? బడ్జెట్‌ పార్టీ మేనిఫెస్టోలానే ఉండాలి. అందులో ఉన్న హామీలను చూసి ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయాలి.లేకపోతే ప్రజల్ని మోసం చేసినట్లు అవుతుంది. చంద్రబాబు అయితే  మేనిఫెస్టోలో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసి ప్రజల్ని మోసగించారు’ అని ధర్మాన పేర్కొన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో అప్పులు పెంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అందుకే ప్రజలు ఓడించి వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను ఎందుకు ఓడిపోయానో తెలియట్లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు