ఫీ‘జులుం’కు కళ్లెం

31 Jul, 2019 09:58 IST|Sakshi

‘మా స్కూల్‌ మా ఇష్టం.. మాకు నచ్చినంత ఫీజు పెంచుకుంటాం.. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తాం..’ అంటూ ఏళ్లుగా సాగిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి రెడ్‌సిగ్నల్‌ పడింది. విద్య వ్యాపారం కాదు.. సేవ అని నినదిస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. వ్యవస్థ సమూల ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందుకు సంబంధించి రెండు కీలక బిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు.. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను ఆచరణలోకి తీసుకొస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు విద్యా రంగంలో నవశక ఆరంభానికి శ్రీకారం చుట్టింది. వ్యవస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టి, ప్రమాణాల పరంగా అద్భుత మార్పు తీసుకువచ్చేలా అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు రెండు బిల్లులను శాసనసభ ఆమోదించింది. అందులో మొదటిది పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, రెండోది ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ బిల్లు. ఈ బిల్లుల ద్వారా జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాన్ని పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్‌ మాఫియాకు చరమగీతం పలికినట్టు అవుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫీజుల భారం ఉండదిక..
ఇప్పటివరకు కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆకర్షణీయ, అర్థం కాని పేర్లతో వేల రూపాయలు ఫీజులను యాజమాన్యాలు వసూల్‌ చేశాయి. ప్రైమరీ స్థాయి విద్యకే 60 నుంచి 80 వేల రూపాయలు దాకా వసూలు చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కమిషన్‌ ద్వారా అధిక ఫీజులకు కళ్లెం పడనుంది. ఫీజుల నిర్ణయానికి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీ ఏర్పాటు చేస్తుంది. ప్రమాణాలు, నిబంధనల మేరకు మాత్రం ఫీజులను వసూల్‌ చేయాలని షరతులు విధిస్తుంది. ఏ మాత్రం నిబంధనలు పాటించని విద్యా సంస్థల గుర్తింపు సైతం రద్దు చేస్తుంది. ఎవరినైనా పిలిపించి విచారించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది.

అనుమతులు రద్దు..
జిల్లాలోని వివిధ పలు ప్రైవేట్‌ విద్యా సంస్థలకు తాజా చట్టం గుదిబండలా పరిణమించనుంది. బిల్లు నిబంధనల మేరకు ఫీజు నియంత్రణ పాటించటంతో పాటు, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు తప్పక పాటించాలి. టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, విద్యార్హతలు వంటి అన్ని విషయాలను పరిశీలించనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సంస్థ అనుమతులు రద్దవుతాయి. జిల్లాలో ఇటీవల ప్రభుత్వ అనుమతిలేని విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించటంతో చాలా బడులు మూతపడుతున్నాయి. తాజా నిర్ణయంతో అనుమతిలేని పాఠశాల వేట సులభం కానుంది.

జిల్లాలో పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యలో సుమారు 3.36 లక్షల మంది, ఇంటర్మీడియెట్‌ స్థాయిలో సుమారు 80 వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌ రంగంలో చదువుతున్నారు. అలాగే ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యలో మరో 30 వేల మంది దాకా ప్రైవేట్‌ విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి తాజా నిర్ణయంతో నాణ్యమైన విద్య అందడంతోపాటు ఫీజు దోపిడీ నుంచి విడుదల పొందుతారు. ఏటా 30 శాతం దాకా పెంచుకుంటూ పోతున్న ఫీజుల భారం నియంత్రణలోకి రానుంది.

ప్రభుత్వ బడులకు మంచి రోజులొస్తాయి...
ప్రైవేట్‌ పాఠశాలలు విద్యను వ్యాపారం చేశాయి. వాటిని నియంత్రించే వ్యవస్థ కరువైంది. ప్రైవేట్‌ విద్యాలయాల్లో ఫీజులు నియంత్రణ పటిష్టంగా ఉంటే వాటి సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాల మనుగడ పెరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లు ఆ దిశగా ఉంది. చట్టం అమలు పారదర్శకంగా, కఠినంగా ఉండాలి. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి. 
– కొమ్ము ప్రసాద్, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు