సమష్టిగా పనిచేద్దాం

16 Jun, 2014 01:38 IST|Sakshi
సమష్టిగా పనిచేద్దాం
  • సమస్యలపై నిరంతర పోరాటం
  •  పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
  •  పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిన జగన్
  •  కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • ‘‘అందరం సమష్టిగా పనిచేద్దాం. ఏ ఒక్కరూ మనోధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. జిల్లాలో మీకు మన పార్టీ ఎమ్మెల్యేలు అన్ని విషయాల్లో అండగా నిలుస్తారు. ప్రతి కార్యకర్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడే. కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలు స్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ‘‘మనది ప్రజల పక్షం. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే’’ అని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో రెండో రోజు నియోజకవర్గాల సమీక్షలో
    ఆయన మాట్లాడారు. ఆదివారంతో ఈ సమీక్షలు ముగిశాయి.
     
    సాక్షి ప్రతినిధి, విజయవాడ : ప్రజా సమస్యలే ఎజెండాగా... పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిర్మాణ పరంగా జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా సమీక్షా సమావేశాలు నిర్ణయించాయి. శని, ఆదివారాల్లో విజయవాడలోని ఆహ్వానం ఫంక్షన్‌హాలులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, ముఖ్య నాయకులతో సమీక్షలు జరిగాయి.

    పార్టీ ఓటమి చెందిన నియోజవర్గాల్లో కారణాలతో పాటు గెలుపొందిన నియోజకవర్గాల్లో విజయం వరించిన అంశాలపై సుదీర్ఘమైన సమీక్షలు జరిగాయి. సమావేశాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. పార్టీ ఓటమి చెందిన నియోజకవర్గాల్లో మరింత బలాన్ని పెంచేందుకు ఆయా నియోజకవర్గాల నాయకులు చేసిన సూచనలను జగన్ పూర్తిస్థాయిలో విన్నారు.

    ఆయన కూడా వారికి కొన్ని సూచనలు చేశారు. దేశంలో అధికారంలోకి ఒకే పార్టీ వస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మోడీ నాయకత్వాన్ని కొంతమంది జనం బలపరిచారని, బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకోవడం లాభించిదనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చే శారు. ఆయన అభిప్రాయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకీభవించారు. పైగా చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు నిర్ణయించారని, ఈ విషయాన్ని జనం త్వరలోనే తెలుసుకుంటారని జగన్ చెప్పారు. అమలు చేయలేని అబద్ధపు హామీలు ఇవ్వలేనందునే మనకు ఓట్ల శాతం తగ్గిందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు వైఫల్యాలు కూడగట్టడమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మరింత చేరువ కావాలని నేతలకు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.
     
    రైతు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీపై ప్రతి నియోజకవర్గ సమావేశంలోనూ  చర్చ జరిగింది. అయితే చంద్రబాబు రుణమాఫీపై ఆంక్షలు పెట్టి ఇచ్చిన హామీని నెరవేర్చానని న మ్మించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని రైతులకు వివరించడంలో పార్టీ శ్రేణులు ముందుండాలనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ హామీని ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదంటూ నెపాన్ని వారిపై నెట్టి హామీని గాలికొదిలే సే అవకాశం ఉందని సమీక్షలో జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే చంద్రబాబు సమర్థ నేత అని, రైతుల కోసం ఎంతో కష్టపడ్డాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9లు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెడుతూ చంద్రబాబును వెనుకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని పార్టీ శ్రేణులకు జగన్ వివరించారు.
     
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో అధికారాన్ని అప్పగించిన ప్రజలకు నేతలు కృతజ్ఞతగా ఉండటంతో పాటు వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు.
     
    కార్యకర్తల్లో నూతనోత్సాహం...
     
    సమీక్ష సమావేశాల్లో జగన్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఓటమి చెందిన నియోజకవర్గాల్లో కొందరు కార్యకర్తలు, నాయకులు నిస్పృహతో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఆ నిస్పృహ నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరికీ మేమున్నామనే భరోసా ఇవ్వాలని జగన్ ముఖ్య నేతలకు సూచించారు. సమీక్షల్లో జగన్ ఎంతో ఆసక్తిగా కార్యకర్తలు చెప్పినవన్నీ వినడంతో రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. రానున్న రోజుల్లో జనం మనవైపే వస్తారని, కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని వైఎస్సార్‌సీపీ కోల్పోయిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయకపోతే జనం మనల్ని క్షమించరనే ఉద్దేశంతోనే అనవసరపు హామీలు ఇవ్వలేదన్నారు. సమీక్ష సమావేశాల్లో రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొల్గొన్నారు.

మరిన్ని వార్తలు