సారథుల్లేని స్థానికం! | Sakshi
Sakshi News home page

సారథుల్లేని స్థానికం!

Published Mon, Jun 16 2014 1:37 AM

local body chairperson election notification yet to release

* ఫలితాలొచ్చి నెలైనా జాడే లేని చైర్‌పర్సన్ ఎన్నికలు..
* రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని విభజించకపోవడమే సమస్య
* విభజన బిల్లులో ప్రస్తావించని కేంద్రం
* గవర్నర్ లేఖ రాసినా స్పష్టత ఇవ్వని వైనం
* ఏపీలో ఏడు మండలాలు విలీనంతో ఖమ్మం జెడ్పీకి స్టే
* తలకు మించిన భారంగా ‘క్యాంప్‌ల నిర్వహణ’
 
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల సారథుల ఎన్నిక ప్రక్రియ డోలాయమానంలో పడింది. ఎన్నికల ఫలితాలు వెల్లడై నెల రోజులు దాటినా ఆ అంశం ఎటూ తేలక అయోమయంగా మారింది. అసెంబ్లీ, లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోగా సభ్యులకు నోటీసులిచ్చి స్థానిక సంస్థల చైర్‌పర్సన్లఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని స్థానిక ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం తెలిసిందే.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కుండటం, పంచాయతీరాజ్ సంస్థల్లోనూ వారు సభ్యులు కావడంతో వారి ప్రమాణస్వీకారం తర్వాతే చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. కానీ జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిగా మనుగడలోకి వచ్చిన నేపథ్యంలో మండల, మున్సిపల్, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక వ్యవహారం గందరగోళంలో పడింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గురించి కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం.

ఎన్నికల సంఘం ఏడాది పాటు ఇరు రాష్ట్రాలకు సేవలు అందించాలని గానీ, లేదంటే దాన్ని కూడా విడదీయాలని గానీ స్పష్టత ఇవ్వలేదు. అసలు దాని గురించే ఎక్కడా పేర్కొనలేదు. కనీసం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని విభజన బిల్లులో పదో షెడ్యూల్‌లోనైనా చేర్చి ఉంటే ఏడాది పాటు ఇరు రాష్ట్రాలకు సేవలందించే అవకాశముండేది. అలా కూడా చేయకపోవడంతో ఇబ్బంది వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విభజన ప్రతిపాదన లేకపోవడంతో దాని పరిధిపై మీమాంస తలెత్తింది. దాంతో సంస్థ ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లింది. తమ పరిస్థితేమిటో తేల్చాలంటూ ఆయనకు లేఖ రాసింది.

ఎన్నికల సంఘం అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన కేంద్రానికి లేఖ రాసినా ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇరు రాష్ట్రాలకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వడానికి నిబంధనలు అడ్డొస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే నోటిఫికేషన్ తెలంగాణకు ఎలా వర్తిస్తుందంటూ ఎవరైనా కోర్టుకు వెళ్తే అది చెల్లుబాటు కాకపోవచ్చన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. దాంతో నోటిఫికేషన్ జారీలో ఇలా జాప్యం జరుగుతోంది. స్థానిక ఫలితాల తరవాత ఫలితాలు వెలువడిన లోక్‌సభ, అసెంబ్లీలకు సంబంధించి కేంద్రంలోనూ, ఇరు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ప్రభుత్వాలు కొలువుదీరినా స్థానిక సంస్థలకు మాత్రం ఇంకా మోక్షం లభించడం లేదు.
 
మే 12, 13 తేదీల్లోనే ఫలితాలు
మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ ఆరు, 11 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగడం మే 12, 13 తేదీల్లో వాటి ఫలితాలు కూడా వెలువడటం తెలిసిందే. ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నెల రోజులుగా ప్రమాణస్వీకారం కూడా చేయకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే పరిస్థితులు తలెత్తాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలను చేజిక్కించుకోజూస్తున్న పార్టీల నేతలకు క్యాంపుల నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. తొలుత కొన్నాళ్లదాకా క్యాంపులు నడిపిన పార్టీలు, నేతలు ఆ తర్వాత వెనక్కు తగ్గినట్టు వార్తలొస్తున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్లీ క్యాంపులు నిర్వహించే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానానికి గతంలో ఖరారు చేసిన రిజర్వేషన్ చెల్లదంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినందున జనాభా లెక్కలు పూర్తిగా మారిపోయాయని, అలాంటప్పుడు పాత రిజర్వేషన్‌ను ఎలా అమలు చేస్తారని వారు వాదిస్తున్నారు.
 
బాబోయ్ ‘క్యాంపు’ ఖర్చులు!
సాక్షి నెట్‌వర్క్: ఎన్నికలు ఆలస్యమవుతుండటంతో క్యాంపుల నిర్వహణ తలకు మించిన భారంగా మారి మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల ఆశావహులు తల పట్టుకుంటున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని చోట్ల ఇండిపెండెంట్లతో పాటు విజేతల్లో వీలైనంత మందిని వారు తొలుత దూరప్రాంతాలకు తరలించి క్యాంపులు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు కొంతకాలం పాటు భారీగా ఖర్చు చేశారు.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, కర్నూలు వంటి జిల్లాల్లోనైతే ఎంపీటీసీలను కూడా ఢిల్లీ, ఆగ్రా వంటి ప్రాంతాలకు తరలించి సకల సౌకర్యాలూ కల్పించారు. జెడ్పీటీసీ సభ్యులకైతే స్టార్ హోటళ్లలోనే బస కల్పించాల్సి వచ్చింది. టీడీపీ ఆశావహులైతే తమకు మెజారిటీ ఉన్న విజయనగరం, గుంటూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో కూడా జెడ్పీటీసీ సభ్యులకు కూడా గోవా, ఊటీ, కొడెకైనాల్, కూర్గ్ తదితర చోట్ల విలాసవంతమైన రిసార్టుల్లో బస ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికలు ఎప్పుడన్నది తెలియకపోవడం వల్ల వారిని వెనక్కి రప్పించారు. అయితే, ‘షెడ్యుల్ వస్తే వారిని తిరిగి క్యాంపులకు తరలిస్తాం. ఇప్పటికే లక్షల్లో ఖర్చయింది. మరింత ఖర్చుకు కూడా వెనుకాడబోం’ అని వారు చెబుతుండటం విశేషం.

కర్నూలు జెడ్పీ చైర్మన్‌గిరీపై కన్నేసిన ఒక టీడీపీ నేత అయితే బెంగళూరు శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఏకంగా 23 రోజుల పాటు బస ఏర్పాటు చేశారు. ఎంతకూ షెడ్యూల్ రాకపోవడంతో వారిని వెనక్కు రప్పించారు. అది రాగానే వీలైతే మరింత ఎక్కువ మందిని ఊటీకి తరలించేందుకు సదరు నేత ఇప్పటినుంచే సిద్ధపడుతున్నారు! ఈ జిల్లాలో టీడీపీకి మెజారిటీ రాకపోయినా వైఎస్సార్‌సీపీ సభ్యులకు వల వేసే ప్రయత్నం చేస్తుండటం తెలిసిందే.

Advertisement
Advertisement