పెద్దల సభపై నమ్మకం పోయింది..

23 Jan, 2020 17:55 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెద్దల సభపై నమ్మకం పోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలిలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయని.. ఏపీలో మండలి తీరు బట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా శాసనమండలి కి వచ్చి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ దైవభక్తి, నిజాయితీ గల వ్యక్తి అని.. కానీ చంద్రబాబు ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ముఖ కవళికల్లో కనిపించిందన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం శాసన మండలిలో చర్చకు రాకుండా పక్కకు పెట్టడం అత్యంత నిబంధనలకు విరుద్ధం అని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలు ముందుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం అని చెప్పడం కూడా రూల్స్‌కు విరుద్ధమేనన్నారు. చైర్మన్‌కు నేరుగా రూలింగ్ ఇచ్చే అధికారం లేదని.. కమిటీకి పంపించాలా లేదా అనే అంశాన్ని సభ్యుల  దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. సభ్యులు ఓటింగ్ కోరితే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిన విషయం పై ఓటింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత చైర్మన్ కు వుందని వివరించారు. మండలి లో నిన్న జరిగిన తీరు అప్రజాస్వామికం అని వీరభద్రరావు పేర్కొన్నారు.

(చదవండి: బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...)

మరిన్ని వార్తలు