‘మండలిని రద్దు చేయండి’ | Sakshi
Sakshi News home page

‘సభ్యునిగా ప్రతిపాదిస్తున్నా.. మండలిని రద్దు చేయండి’

Published Thu, Jan 23 2020 6:08 PM

Pilli Subhash Chandra Bose Speech Over AP Legislative Council - Sakshi

సాక్షి, అమరావతి : శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అసహనం వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలని ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపాదిస్తున్నానని అన్నారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌ మాట్లాడుతూ.. చట్టాలు చేసే సభలో సభాపతులు వ్యవహరించిన తీరుపై చర్చించడం దారుణమన్నారు.

బుధవారం మండలిలో జరిగిన చర్చలో మంత్రుల సలహాలను చైర్మన్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. కావాలనే బిల్లులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్‌ను ప్రభావితం చేశారని ఆరోపించారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే పెద్దల ఉందన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసే సభాధిపతులే.. చట్టాలను అతిక్రమిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు.

‘మంచి ఆలోచనలతో రాజ్యాంగ నిర్మాతలు పెద్దల సభ పెట్టారు. శాసన సభకు విద్యావంతులు రాకపోవడం, ధన బలం ఉన్నవాళ్లు ఎన్నికవ్వడం జరగవచ్చు. అలాంటి సమయంలో వారికి ఇష్టం వచ్చిన చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బంది కలిగిస్తారనే భయంతో పెద్దల సభ ఏర్పాటు చేశారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే ఈ సభ ఏర్పాటైంది. కానీ నేడు అది రాజకీయాలకు కేంద్ర బిందువైంది. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మారాయి. టీడీపీ నేతలు నేరుగా చైర్మన్‌ దగ్గరకు వచ్చి బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపమని సలహాలు ఇచ్చారు.

చైర్మన్‌ తప్పు చేశానంటునే విచక్షణాధికారంతో బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారు. తప్పు చేసిన వారికి విచక్షణాధికారం ఎలా ఉంటుంది? రూల్‌ 71 ఎప్పుడు ఉపయోగించాలో తెలియకుండా చర్చించారు. సభాపతే చట్టాలను ఉల్లంఘిస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది.  చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చోని చైర్మన్‌ను ప్రభావితం చేశారు. టీడీపీ సభ్యుల సలహా మేరకు చైర్మన్‌ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారు. దీనికంటే ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే గౌరవంగా ఉండేది. మండలి సభ్యునిగా ముఖ్యమంత్రి, స్పీకర్‌కు ప్రతిపాదిసున్నా.. సభను వెంటనే రద్దు చేయండి. రాజకీయాలకు ఉపయోగపడే సభ నిష్ర‍్పయోజనం.  రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది’ అని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement