ప్రచారం కోసమే గిరిజనులకు మోసం

23 Feb, 2016 23:38 IST|Sakshi

పాలకొండ రూరల్: ప్రభుత్వం కేవలం తమ ప్రచారం కోసం గిరిజనులను మోసం చేస్తోందని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. మంగళవారం పాలకొండలో విలేకరులతో మాట్లాడారు. సీతంపేట ఐటీడీఏకు చంద్రన్న సంక్షేమ పథకాల పంపిణీకి రానున్న గిరిజన మంత్రి రావెల కిషోర్‌బాబు కేవలం ప్రచారం చేసుకునేందుకు వస్తున్నారే తప్ప గిరిజనులపై ప్రేమతో కాదన్నారు.
 
 ఇటీవల జరిగిన గవర్నింగ్‌బాడీ సమావేశాల్లో ఇక్కడ పేరుకుపోయిన సమస్యలు చర్చించడానికి వీలుకుదుర్చుకోలేని మంత్రి గిరిజనుల శ్రేయస్సుకు ఏం చేయగలని ప్రశ్నించారు. ఒక్కనాడైనా రాష్ట్రాంలో ఉన్న ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించని మంత్రి నిర్లక్ష్యధోరణి వల్ల గిరిజన యువత, విద్యార్థులు, వసతి గృహాలు, సంక్షేమ, అభివృద్ధి పనులకు ఆటంకం వాటిల్లిందన్నారు.  స్థానికంగా విద్యార్థుల పుస్తకాలు, యూనిఫారాలు, క్రీడా పరికరాలు, మైదానాలు పూర్తిస్థాయిలో లేని విషయాన్ని గుర్తించారా అని, కరువు మండలాలుగా ప్రకటించిన బామిని, సీతంపేటలకు ఏం లాభం ఒనగూర్చారని ప్రశ్నించారు.
 
  కేవలం 1300ల మందికి లబ్ధిచేకూర్చేందుకు వస్తున్న మంత్రి వల్ల గిరిజనుల సొమ్ము వృథాగా పోతుందన్నారు.  జిల్లాలో లక్షల మంది గిరిపుత్రులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై దృష్టిసారించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. సీతంపేటలో ఒకరోజు పర్యటిస్తే ప్రజల సమస్యలు అర్ధమవుతాయన్నారు. సమావేశంలో సీతంపేట ఎంపీపీ, జెడ్‌పీటీసీలు సవర లక్ష్మి, పి.రాజబాబు, జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దుర్గారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు