రాజధానిలో పోటాపోటీగా శుద్ధి కార‍్యక్రమం

21 Jan, 2017 12:43 IST|Sakshi
రాజధానిలో పోటాపోటీగా శుద్ధి కార‍్యక్రమం

అమరావతి : రాజధానికి సీఎం చంద్రబాబుతో పట్టిన అరిష్టం పోవాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తిరిగిన రోడ్లపై గో పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తొలగించి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు వచ్చిన తర్వాతనే అరిష్టం పట్టుకుందన్నారు. అరిష్టం పోవాలనే శుద్ధి కార్యక్రమం చేపట్టమని చెప్పారు. మూడు పంటలు పండించే రైతులు ఇప్పుడు వలసపోతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంత గ్రామాల్లో రైతులు, రైతు కూలీల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో టీడీపీ నేతలు బినామీలుగా మారారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని చెప్పారు.

శుద్ధి నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుమతి లేకుండా నిర్వహించిన టీడీపీ నేతల ర్యాలీని ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నేతలు ప్రశ్నించారు.