పన్ను రేట్ల కోత..?

20 Sep, 2019 05:47 IST|Sakshi

నేడు జీఎస్‌టీ మండలి కీలక సమావేశం

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో... పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్‌ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్‌టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశం కానున్నారు.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో బిస్కెట్ల నుంచి ఆటోమొబైల్‌ విభాగం వరకూ, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) నుంచి హోటెల్స్‌ వరకూ వివిధ రంగాల నుంచి రేట్ల తగ్గింపునకు గట్టి డిమాండ్‌ వస్తోంది. పన్ను కోతల వల్ల వినియోగం, దేశీయ డిమాండ్‌ పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే పన్నుల తగ్గింపువల్ల అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థ మరింత ఇబ్బందుల్లో పడుతుందని జీఎస్‌టీ కౌన్షిల్‌ ఫిట్‌మెంట్‌ కమిటీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

సమావేశంలో చర్చించే అవకాశమున్న మరిన్ని అంశాలు...
► జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణ రద్దు నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు జీఎస్‌టీ చట్ట నిబంధనల వర్తింపునకు సవరణలపై చర్చ
►పసిడి, ఇతర విలువైన రాళ్ల రవాణా విషయంలో కేరళ ప్రతిపాదిస్తున్న  ఈ–వే బిల్‌ వ్యవస్థపై దృష్టి
►ఆధార్‌ నంబర్‌తో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ అనుసంధానించాలని∙ప్రతిపాదన.

దశలవారీగా వాహనాలపై జీఎస్‌టీని తగ్గించాలి: హీరో మోటో
ఆటోమొబైల్‌ వాహనాలపై దశలవారీగా అయినా జీఎస్‌టీ రేటును తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని హీరో మోటోకార్ప్‌ కోరింది. ముందుగా ద్విచక్ర వాహనాలపై వెంటనే రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తర్వాత దశలో కార్లపై రేట్లను తగ్గించాలని సూచించింది. కీలకమైన జీఎస్‌టీ భేటీ శుక్రవారం జరగనుండగా, దానికి ఒక్క రోజు ముందు హీరో మోటో కార్ప్‌ ఈ డిమాండ్‌ చేయడం గమనార్హం. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఒకేసారి ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉండదని పేర్కొంది. అదే సమయంలో 2 కోట్ల ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ఇది ఉపశమనం ఇస్తుందని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌వో నిరంజన్‌గుప్తా అన్నారు.  కాగా, ఆటోమొబైల్‌ వాహనాలపై జీఎస్టీ తగ్గింపునకు జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీ తిరస్కరించిన విషయం గమనార్హం.

సానుకూల నిర్ణయం...: టాటా మోటార్స్‌
వాహన రంగం రంగం పురోగతికి సంబంధించి జీఎస్‌టీ మండలి నుంచి ఒక కీలక సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు టాటా మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  గుంటర్‌ బషెక్‌ వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా