కెమికల్స్‌ కేంద్రం కార్బానియో!

19 Jan, 2019 00:38 IST|Sakshi

ఆన్‌లైన్‌లో 4.5 లక్షల రసాయనాలు

8 నెలల్లో విదేశాల్లోకి ఎంట్రీ

2 నెలల్లో రూ.20 కోట్ల  నిధుల సమీకరణ

‘స్టార్టప్‌ డైరీ’తో కార్బానియో ఫౌండర్‌ డాక్టర్‌ రఫీ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ రోజుల్లో ఆన్‌లైలో దొరకనిదంటూ ఏదీ లేదు. కెమికల్స్‌తో సహా! అలాగని, ఆన్‌లైన్‌లో రసాయనాలను విక్రయించడం తేలికేమీ కాదు. ఎవరు విక్రయిస్తున్నారు? ఎవరు కొంటున్నారు? ఇవన్నీ కీలకమే. లేకుంటే చాలా అనర్థాలొస్తాయి. దీన్నో సవాలుగా తీసుకుని... కెమికల్స్‌ పరిశ్రమను సంఘటిత పరిచి.. ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది హైదరాబాద్‌కు చెందిన కార్బానియో! క్రయవిక్రయాలే కాకుండా అకడమిక్‌ స్థాయిలో విద్యార్థుల పరిశోధనలకు ఉచితంగా కెమికల్స్‌ను అందిస్తోంది కూడా. మరిన్ని వివరాలను కార్బానియో.కామ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ రఫీ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.  

‘‘మాది వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు. ఎస్‌వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ.. పాండిచ్చేరి సెంట్రల్‌ వర్సిటీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశా. తర్వాత తైవాన్‌లోని నేషనల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో (ఎన్‌హెచ్‌ఆర్‌ఐ), ఇటలీలోని బొలోగ్నా యూనివర్సిటీలో పదేళ్లు రీసెర్చర్‌గా పనిచేశా. అకడమిక్, పరిశ్రమ రంగాల్లో గమనించిందొక్కటే.. మన దేశంలో వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న రసాయనాల లభ్యత కష్టమని!. దీనికి పరిష్కారంగా కెమికల్స్‌ అమ్మటం, కొనడం రెండింటికీ ఒకే వేదికపైకి తేవాలనుకున్నా!! టెక్నాలజీ మిత్రుడు విజయ్‌ ఎస్‌ దేవరకొండతో కలిసి 2017 అక్టోబర్‌లో రూ.20 లక్షల పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా కార్బానియో.కామ్‌ను ప్రారంభించాం. కార్బన్‌ లేనిదే ఏ రసాయన చర్యా జరగదు. దీన్నే ఇటాలియన్‌లో కార్బానియో అంటారు. అందుకే కంపెనీకి ఈ పేరు పెట్టాం. 

4.5 లక్షల రసాయనాలు.. 
రసాయన తయారీ సంస్థలు, రిటైలర్లు కెమికల్స్‌ను కార్బానియోలో ధరలతో సహా లిస్ట్‌ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 వేల మంది నమోదయ్యారు. ఆగ్రో, పాలిమర్, పెట్రో వంటి అన్ని రంగాల కెమికల్స్‌ ఉంటాయి. మొత్తం 4.5 లక్షల కెమికల్స్‌ ఉన్నాయి. నెలకు 30 వేల కొత్త రసాయనాలు జతవుతున్నాయి. వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల కెమికల్స్‌ను అందుబాటులోకి తేవాలన్నది   మా లక్ష్యం. రూ.85 నుంచి రూ.7.5 లక్షల ధరల వరకూ రసాయనాలున్నాయి. బయటి మార్కెట్‌తో పోలిస్తే కార్బానియోలో ధరలు 65 శాతం వరకు తక్కువగా ఉంటాయి. 

ఏడాదిలో రూ.200 కోట్ల ఆదాయం.. 
విద్యా సంస్థలు, ఫార్మా కంపెనీలకు మాత్రమే రసాయనాలను విక్రయిస్తాం. ప్రస్తుతం 5 వేల మంది కస్టమర్లున్నారు. వీరిలో 700 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉంటారు. మా మొత్తం ఆర్డర్లలో 40 శాతం విద్యా సంస్థలు, 60 శాతం ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నాయి. అహ్మదాబాద్, ముంబై వంటి నగరాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకు 2,700 ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. వీటి విలువ రూ.40 లక్షల వరకూ ఉంటుంది. ప్రతి ఆర్డర్‌పై 10 శాతం కమీషన్‌ ఉంటుంది. ఏడాది కాలంలో రూ.200 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. త్వరలోనే సెంట్రల్‌ యూనివర్సిటీలతో ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందం చేసుకోనున్నాం. 

8 నెలల్లో అమెరికాలోకి ఎంట్రీ.. 
కెమికల్స్‌ను యూనివర్సిటీ విద్యార్థులకు పరిశోధన కోసం ఉచితంగా అందిస్తున్నాం. సుమారు 7,500 కిలోల బరువు గల కెమికల్స్‌ను ఉచితంగా అందించాం. 8 నెలల్లో అమెరికా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాం. అక్కడి కెమికల్స్‌ను ఇండియాలో విక్రయిస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 9 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 25కి చేరుస్తాం. 2 నెలల్లో రూ.20 కోట్ల నిధులను సమీకరించాలన్నది లక్ష్యం’’ అని రఫీ వివరించారు.  

మరిన్ని వార్తలు