కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా

4 Jan, 2020 03:24 IST|Sakshi

75 శాతం వాటా కొనుగోలు

కంపెనీ విలువ రూ.13,572 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌.. కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) 75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కేపీసీఎల్‌ను ప్రమోట్‌ చేస్తున్న సీవీఆర్‌ గ్రూప్‌ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా విలువ కట్టారు. డీల్‌ అనంతరం మిగిలిన 25 శాతం వాటా  కేపీసీఎల్‌ చేతిలోనే ఉంటుంది. మల్టీ కార్గో ఫెసిలిటీ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు ద్వారా 2018–19లో 5.4 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది.

దీనిని ఏడేళ్లలో 10 కోట్ల మెట్రిక్‌ టన్నుల స్థాయికి తీసుకు వెళ్లాలని అదానీ పోర్ట్స్‌ భావిస్తోంది. కృష్ణపట్నం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,394 కోట్ల టర్నోవర్‌ సాధించింది. తూర్పు తీరంలో అదానీకి ఇది అయిదవది కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది. కాగా, 2025 నాటికి 40 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా స్థాయికి చేరాలన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లక్ష్యానికి ఈ కొనుగోలు దోహదం చేయనుంది. తాజా డీల్‌తో దేశంలో పోర్టుల వ్యాపారంలో తమ సంస్థ వాటా ప్రస్తుతమున్న 22 నుంచి 27%కి చేరుతుందని అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త విస్తరణలో ఇది తమకు విలువ చేకూరుస్తుందని చెప్పారు. 120 రోజుల్లో ఈ లావాదేవీని పూర్తి చేస్తారు.

మరిన్ని వార్తలు