వచ్చే నెల 30 నుంచి ఎయిర్‌సెల్‌ సేవలు నిలిపివేత 

21 Dec, 2017 00:08 IST|Sakshi

ఎమ్‌ఎన్‌పీకి మార్చి 10 వరకూ గడువు   

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌ కంపెనీ ఆరు టెలికం సర్కిళ్లలో తన కార్యకలాపాలను వచ్చే నెల 30 నుంచి ఆపేయనున్నది. గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ టెలికం సర్కిళ్లలో జనవరి 30 నుంచి మొబైల్‌ సర్వీసులను నిలిపేస్తామని ఎయిర్‌సెల్‌ (ఎయిర్‌సెల్‌ లిమిటెడ్, డిష్‌నెట్‌ వైర్లెస్‌లను కలిపి ఎయిర్‌సెల్‌ గ్రూప్‌గా పరిగణిస్తారు)తెలిపింది. తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో వ్యాపారం నిర్వహించలేమంటూ ఈ ఆరు సర్కిళ్లలో లైసెన్స్‌లను సరెండర్‌ చేస్తున్నామని ఈ నెల 1నే ట్రాయ్‌కు  ఎయిర్‌సెల్‌ తెలిపింది.

 కంపెనీ ఈ 6 సర్కిళ్లలో 40 లక్షల మందికి 2జీ సేవలందిస్తోంది. వినియోగదారులందరికీ, 30 రోజుల ముందుగానే ఈ విషయాన్ని వెల్లడించామని, అందరికీ యూనిక్‌ పోర్టింగ్‌ కోడ్స్‌ను పంపించామని వివరించింది. కాగా వేరే నెట్‌వర్క్‌ను మారాలనుకుంటున్న ఎయిర్‌సెల్‌ వినియోగదారుల అభ్యర్థనలను వచ్చే ఏడాది మార్చి 10 వరకూ అంగీకరించాలని ఇతర టెల్కోలను ట్రాయ్‌ ఆదేశించింది. 

>
మరిన్ని వార్తలు